10 August, 2026 | 12:11 AM

భర్త వేధింపులకు భార్య బలి

26-05-2024 01:35 AM

అనాజ్‌పూర్‌లో వివాహిత ఆత్మహత్య

అబ్దుల్లాపూర్‌మెట్, మే 25 : భర్త వేధింపులు తట్టులేక భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్ గ్రామంలో ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం ఎస్సై కరుణాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అనాజ్‌పూర్‌కు చెందిన నార్లకొండ మహేందర్, పారిజాత భార్యభర్తలు. వీరికి సాయిరాం, విష్ణు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు పాల వ్యాపారం చేస్తూ గ్రామంలోనే నివసిస్తున్నారు. మహేందర్ మద్యానికి బాససై నిత్యం భార్యను వేధించేవాడు. వీరి గొడవలు పెద్దల వరకు చేరాయి.

పలుమార్లు పంచాయితీ నిర్వహించి, భార్యాభర్తలకు పెద్ద మనుషులు సర్ధిచెప్పారు. అయినా, మహేందర్‌లో మార్పు రాలేదు. ఈ క్రమంలో శుక్రవారం భార్యాభర్తలు మరోసారి గొడవపడ్డారు. మనస్తాపం చెందిన పారిజాత పురుగుల మందు తాగి, ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న మహేందర్.. తన సోదరుడు జంగయ్య, బావమర్ది సురేశ్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో పారిజాతను హుటాహుటిన వనస్థలిపురంలోని ఏరియా దవాఖానకు తరలించారు. అప్పటికే పారిజాత మృతి చెందిందని వైద్యులు తెలిపారు. భర్త పెట్టే వేధింపులు తట్టుకోలేకనే తన సోదరి పారిజాత ఆత్మహత్యకు పాల్పడిందని సోదరుడు సురేశ్  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ ఎస్సై కరుణాకర్‌రెడ్డి తెలిపారు.