రూపాయి మరింత పతనం
ముంబై, మే 31: బుధవారం హఠాత్ పతనాన్ని చవిచూసిన రూపాయి ఒక రోజు విరామం అనంతరం శుక్రవారం అదేస్థాయిలో క్షీణించింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో డాలరు మారకంలో రూపాయి విలువ 20 పైసలు పడిపోయి 83.49 వద్ద ముగిసింది. బుధవారం ఇది 22 పైసలు తగ్గింది. అయితే గురువారం 11పైసలు కోలుకున్నప్పటికీ, తాజాగా మళ్లీ పడిపోయింది. దిగుమతిదారులు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుంచి డాలర్లకు డిమాండ్ ఏర్పడటం కూడా రూపాయిని నష్టపర్చిందని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. అయితే బాండ్ మార్కెట్లలోకి విదేశీ నిధులు తరలిరావడం రూపాయి మరింత క్షీణించకుండా నిరోధించిందన్నారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో విక్రయాలు జరపడమూ రూపాయిని దెబ్బతీసింది. వారం రోజుల క్రితం రూపాయి విలువ 83.10 స్థాయికి బలపడింది.
మరికొద్ది రోజులు బలహీనమే
ఆయిల్ కంపెనీలు, దిగుమతిదార్ల నుంచి డాలర్ల డిమాండ్ కొనసాగనున్నందున, వచ్చే కొద్దిరోజులూ రూపాయి బలహీనంగానే ట్రేడవుతుందని, పటిష్టపడుతున్న యూఎస్ డాలర్ రూపాయిపై ఒత్తిడి పెంచుతుందని బీఎన్‌పీ పారిబా రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి చెప్పారు. డాలర్ ఇండెక్స్ తాజాగా 104.7 సమీపంలో కదులుతున్నది. బ్రెంట్ క్రూడ్ ధర 0.78 శాతం పెరిగి 84.88 డాలర్ల వద్దకు చేరింది. ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు నిధులు వెనక్కు తీసుకునే అవకాశం ఉన్నందున రూపాయి మరింత బలహీనపడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.






