28 June, 2026 | 11:24 PM

ఇండియాలోకి లక్ష కేజీల బంగారం

01-06-2024 12:05 AM

ముంబై, మే 31: యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)లో స్టోర్ చేసిన లక్ష కేజీల బంగారాన్ని (100 టన్నులు) రిజర్వ్‌బ్యాంక్ 2023 ఆర్థిక సంవత్సరంలో ఇండియాకు తీసుకొచ్చింది. యూకేలో వాల్ట్స్‌లో దాచిన పుత్తడిని దేశీయ వాల్ట్స్‌లోకి తరలించినట్టు శుక్రవారం సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇంత పెద్ద పరిమాణంలో బంగారం ఇరు దేశాల మధ్య రవాణా జరగడం  1991 తర్వాత ఇదే తొలిసారి. అధిక విలువ కలిగిన 100 టన్నుల బంగారాన్ని దేశంలోకి తీసుకువచ్చే ప్రక్రియను పూర్తి గోప్యంగా పూర్తిచేశారని, ఆర్థిక శాఖ, ఆర్బీఐ అధికారులు, ఇతర ఏజెన్సీలు ఇందులో పాలుపంచుకున్నట్టు ఆ వర్గాలు వివరించాయి.

ఇందుకోసం ప్రత్యేక రవాణా విమానాల్ని ఉపయోగించారు. 1991లో భారత్ విదేశీ మారక ద్రవ్య కొరత ఎదుర్కొన్నపుడు బంగారం తనఖా చేయడానికి అప్పట్లో యూకేకు తరలించిన భారత్ ఇప్పుడు దేశంలోకి తీసుకురావడం గమనార్హం. అధికారిక గణాంకాల ప్రకారం భారత్ వద్దనున్న బంగారం నిల్వలు గత ఆర్థిక సంవత్సరంలో 27.46 టన్నులు పెరిగి 822 టన్నులకు చేరాయి. అందులో అధిక భాగాన్ని విదేశాల్లోని వాల్ట్స్‌లో స్టోర్ చేయడం జరుగుతుందని ఆ వర్గాలు వెల్లడించాయి. ఇతర దేశాల్లానే భారత్ కూడా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద కొంత పసిడిని అట్టిపెడుతుంది.

2023 100 టన్నుల బంగారాన్ని ఇండియాకు తేవడంతో ప్రస్తుతం స్థానికంగా స్టోర్ చేసిన పుత్తడి నిల్వలు దాదాపు 408 మెట్రిక్ టన్నులకు చేరాయి. దీంతో భారత్ తన మొత్తం బంగారం నిల్వల్లో సగం దేశంలోనూ, మరో సగం విదేశాల్లోనూ భద్రపర్చినట్లయ్యింది.  తాము జారీచేసిన కరెన్సీ నోట్లకు ప్రతిగా 308 మెట్రిక్ టన్నుల బంగారాన్ని ఇండియాలో ఉంచామని, మరో 100.28 టన్నులు బ్యాంకింగ్ శాఖ ఆస్తిగా అట్టిపెట్టామని రిజర్వ్‌బ్యాంక్ తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదికలో వెల్లడించింది. విదేశాల్లో ప్రస్తుతం 413.79 మెట్రిక్ టన్నుల బంగారాన్ని భద్రపర్చినట్టు తెలిపింది.

విదేశీ మారక నిల్వలతో పుత్తడి కొనుగోళ్లు

దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వల్ని కేవలం కరెన్సీ రూపంలోనే ఉంచకుండా, అందులో కొంత బంగారంలోకి రిజర్వ్‌బ్యాంక్ మళ్లిస్తుంది. కరెన్సీ ఒడిదుడుకుల్ని అధిగమించే క్రమంలో విదేశీ మారక నిల్వల్ని వివిధీకరించేందుకు గత కొద్ది సంవత్సరాలుగా ఆర్బీఐ బంగారాన్ని కొంటున్నదని, విదేశీ వాల్ట్స్‌లో ఉన్న పుత్తడి నిల్వల్ని కొంత తగ్గించేందుకు దేశంలోకి 100 టన్నుల బంగారాన్ని తీసుకొచ్చినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2009లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) నుంచి భారత్ 200 టన్నుల బంగారాన్ని కొన్నది. అటుతర్వాత విదేశీ మారక నిల్వల వివిధీకరణలో భాగంగా మార్కెట్లో తరచూ కొంటూ వస్తున్నది. ప్రస్తుతం ముంబై, నాగపూర్‌ల్లో హై సెక్యూరిటీ వాల్ట్స్‌లో బంగారాన్ని భద్రపరిచారు.