28 June, 2026 | 9:43 PM

‘వెల్ డన్ ఇండియా’

01-06-2024 12:05 AM

న్యూఢిల్లీ, మే 31: భారత ఆర్థిక వ్యవస్థ అన్ని అంచనాల్ని మించిన వృద్ధి రేటును ప్రదర్శించిందంటూ నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్‌తో సహా ప్రముఖ ఆర్థిక వేత్తలు ప్రశంసలతో ముంచెత్తారు. 7 శాతంపైగా ఇండియా వృద్ధి సాధించడం వరుసగా ఇది మూడవ సంవత్సరమని రాజీవ్ కుమార్ తెలిపారు. ‘వెల్ డన్ ఇండియా! 2024 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి 8.2 శాతంగా వెలువడింది. అన్ని రకాల అంచనాలకంటే చాలా ఎక్కువ.

ఈ వృద్ధి రేటుతో ప్రధాన ఆర్థిక వ్యవస్థలను భారత్ తలదన్నింది. తయారీ, మైనింగ్ రంగాలు పటిష్ఠ వృద్ధిని సాధించాయి’ అంటూ కుమార్ తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. ఇండియా జీ20 షెర్పా అమితాబ్ కాంత్ ఈ వృద్ధి రేటుపై వ్యాఖ్యానిస్తూ ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధిచెందుతున్న ఆర్థిక వ్యవస్థగా తన హోదాను భారత్ పునర్ ప్రదర్శించిందన్నారు. గత ఏడాది 7 శాతం వృద్ధి రేటును అధిగమించి 8.2 శాతం వాస్తవ జీడీపీ వృద్ధి రేటును నమోదుచేసి ఆశ్చర్యపర్చిందని చెప్పారు. ‘మరోసారి అంచనాల్ని తలదన్ని క్యూ4లో భారత్ 7.8 శాతం, 2023 8.2 శాతం వృద్ధి సాధించింది. మరోసారి ప్రధాన ఆర్థిక వ్యవస్థల్ని అధిగమించింది’ అంటూ ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు శామికా రవి సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్‌లో పోస్టు చేశారు. 

ఆశ్చర్యపరుస్తూనే ఉంది

భారత్ వృద్ధి వేగంలో ఆశ్చర్యపరుస్తూనే ఉన్నదని క్రిసిల్ చీఫ్ ఎకానమిస్ట్ ధర్మాకిర్తి జోషి అన్నారు. వ్యవసాయ రంగం కునారిల్లినప్పటికీ, 2024 ఆర్థిక సంవత్సరంలో 8.2 శాతం జీడీపీ వృద్ది నమోదయ్యిందని, ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఎన్‌ఎస్‌వో అంచనాల్నే ఇది అధిగమించిందన్నారు. పారిశ్రామిక చాంబర్ అసోఛామ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ 2025 ఆర్థిక సంవత్సరంలో కూడా వృద్ధి పరుగు కొనసాగుతుందన్న ధీమాను వ్యక్తం చేసింది. ముగిసిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి ఎంతో ఆశావహ అంచనాల్ని సైతం మించిపోయిందని అసోఛామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ వ్యాఖ్యానించారు. జీడీపీ వృద్ధి రేటు తమ అంచనాల్ని, మార్కెట్ అంచనాల్ని అధిగమించినట్టు ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ చెప్పారు.