రూపాయి పతనం
ఒకే రోజు 22 పైసలు తగ్గిన కరెన్సీ విలువ
ముంబై, మే 29: ఇటీవల బలపడిన రూపాయి బుధవారం హఠాత్ పతనాన్ని చవిచూసింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ క్షీణత, ప్రపంచ మార్కెట్లో డాలరు బలపడటం, క్రూడ్ ధరలు పెరగడం రూపాయిని బలహీనపర్చాయి. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో డాలరు మారకంలో రూపాయి విలువ 22 పైసలు క్షీణించి 83.40 వద్ద ముగిసింది. దిగుమతిదారులు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుంచి డాలర్లకు డిమాండ్ ఏర్పడటం కూడా రూపాయిని నష్టపర్చిందని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. అయితే బాండ్ మార్కెట్లలోకి విదేశీ నిధులు తరలిరావడం రూపాయి తీవ్ర పతనాన్ని నిరోధించిందన్నారు. వారం రోజుల క్రితం రూపాయి విలువ 83.10 స్థాయికి బలపడింది.
మరికొద్ది రోజులు బలహీనమే
ఆయిల్ కంపెనీలు, దిగుమతిదార్ల నుంచి డాలర్ల డిమాండ్ కొనసాగనున్నందున, వచ్చే కొద్దిరోజులూ రూపాయి బలహీనంగానే ట్రేడవుతుందని, పటిష్టపడుతున్న యూఎస్ డాలర్ రూపాయిపై ఒత్తిడి పెంచుతుందని బీఎన్‌పీ పారిబా రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి చెప్పారు. డాలర్ ఇండెక్స్ తాజాగా 104.7 సమీపంలో కదులుతున్నది. బ్రెంట్ క్రూడ్ ధర 0.78 శాతం పెరిగి 84.88 డాలర్ల వద్దకు చేరింది. ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు నిధులు వెనక్కు తీసుకునే అవకాశం ఉన్నందున రూపాయి మరింత బలహీనపడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గురువారం రూపాయి 83.20 83.50 శ్రేణిలో ట్రేడ్ కావొచ్చని ఫిన్‌రెక్స్ ట్రెజరీ అడ్వయిజర్స్ ట్రెజరీ హెడ్ అనిల్‌కుమార్ భన్సాలి అంచనా వేశారు.






