కూలిన బతుకులు
గోడ కూలి ఏడుగురు సజీవసమాధి
మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక బాలుడు
30 ఫీట్ల లోతులో కూరుకుపోయిన శవాలు
భవన యజమానిని అరెస్టు చేసిన పోలీసులు
బేగంపేటలో నాలాలో పడి ఇద్దరు మృతి
హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో/మేడ్చల్, మే 8 (విజయక్రాంతి): రెక్కాడితేగాని డొక్కాడని జీవితాలు వాళ్లవి. బతుకుదెరువు కోసం ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ వంటి సుదూర ప్రాంతాల నుంచి పొట్ట చేతపట్టుకొని వచ్చిన బక్క జీవులు. హైదరా బాద్ శివారులో ఓ బిల్డర్ వద్ద ఇటీవలే భవన నిర్మాణ కూలీలుగా పనిలో చేరారు. హమ్మయ్య పని దొరికింది.. నాలుగు మెతుకులు దొరుకుతాయి అనుకొనేంతలో.. వారు ఇటుక ఇటుక పేర్చి నిర్మించిన భవనమే ఆ కూలీల బతుకులను కబలించింది.
మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రిటైనింగ్ గోడ కూలి నాలుగేండ్ల బాబు, ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు దుర్మరణం చెందారు. మృతులను ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రాము యాదవ్ (34), గీతాసింగ్ (32) దంపతులు, వారి నాలుగేండ్ల కుమారుడు హిమాన్షు.. మహారాష్ట్రకు చెందిన శంకర్ గీర్ (22), అతని భార్య ఇంద్రేష్ భావన్, పశ్చిమబెంగాల్‌కు చెందిన శ్రీపతి మహాజన్, అతని భార్య ఖుషీగా గుర్తించారు. శవాలు 30 ఫీట్ల లోతులో మట్టిపెల్లల కింద కూరుకుపోవటంతో బయటకు తీయటం కూడా కష్టమైపోయింది. హృదయ విదారకరమైన ఈ సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బాచుపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది.
ఉరుముతూ వచ్చిన మృత్యువు
బాచుపల్లి శ్రీరేణుకా ఎల్లమ్మనగర్‌లో అరవింద్‌రెడ్డి అనే వ్యక్తి రైజింగ్ డెవలప్‌మెంట్ పేరుతో పెద్ద భవంతిని నిర్మిస్తున్నాడు. ఈ భవంతి వద్ద వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వందల మంది కూలీలు పని చేస్తున్నారు. నిర్మాణంలో ఉన్న భవనం పక్కనే సుమారు 30 ఫీట్ల లోతు గుంత ప్రాంతంలో తాత్కాలిక షెడ్లు నిర్మించుకొని జీవిస్తున్నారు. మంగళవారం పొద్దంతా పనిచేసి అలసిపోయిన కార్మికులు, సాయంత్రం వారి షెడ్లలో సేదతీరుతున్న సమయంలో ఒక్కసారిగా తీవ్ర గాలిదుమారంతో భారీ వర్షం కురిసింది. దీంతో భవంతి చుట్టూ సిమెంట్ ఇటుకలతో నిర్మించిన రిటైనింగ్ వాల్ ఒక్కసారిగా పక్కనే ఉన్న కూలీల నివాసాలపై కూలింది.
రిటైనింగ్ వాల్ కింద ఉన్న మట్టి పెల్లలు కూడా కుంగడటంతో వాటికింద మూడు కుటుంబాలకు చెందిన ఏడుగురు సజీవ సమాధి అయ్యారు. ఈ ప్రమాదంలో సాగర్ నార్వి, సుఖేందర్, మోతీ, తాంగపట్టు, అమీర్, ఈముకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. మృతదేహాలు బురదలో కూరుకుపోవటంతో బుధవారం తెల్లవారు జాము సమయానికిగాని వెలికితీయలేకపోయారు. మృతదేహాలను పోస్టుమా ర్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి భవన యజమాని అరవింద్‌రెడ్డిని అరెస్టు చేశారు.
నాణ్యతలేమి వల్లనే!
రైజింగ్ డెవలప్‌మెంట్ భవనాలను రెండెకరాల విస్తీర్ణంలో జీ+5 అంతస్తుల్లో నిర్మిస్తు న్నారు. ఒక అపార్ట్‌మెంట్ పూర్తవగానే దాని పక్కనే మరో భవంతి కోసం భారీ సెల్లార్‌ను తవ్వి బీస్మెంట్ కూడా లేకుండా ఇసుకపైనే రిటైనింగ్ వాల్ నిర్మించడంతో ఒక్క వర్షానికే అది కూలిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కార్మికుల రేకుల షెడ్లను బవంతి పక్కనే నిర్మించడం కూడా ప్రమాదానికి కారణం.
కార్మికులకు అండగా ఉంటాం
ప్రమాద విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ఇదిలా ఉండగా ఈ భవనాలు గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఓ నాయకుడి పీఏ ఒక ఎన్‌ఆర్‌ఐతో కలిసి నిర్మిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్మిక శాఖ డైరెక్టర్ క్రిష్ణ ఆదిత్య మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.80 వేల చొప్పున (ఆర్థిక సహాయం రూ.50 వేలు, అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.30 వేలు) అందించారు. కార్మిక చట్టాలను ఉల్లంఘించిన భవనగ్ యజమాని అరవింద్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కిషన్‌రెడ్డి, ఈటల సంతాపం
బాచుపల్లిలో గోడ కూలి ఏడుగురు కార్మికులు మృతిచెందటంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మల్కాజిగిరి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు వెంటనే నష్టపరిహరం ఇవ్వాలని, త్వరగా పోస్టుమార్టం పూర్తిచేసి మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపించాలని ప్రభుత్వాన్ని కోరారు. గాయపడినవారికి భవన నిర్మాణ యజమానే చికిత్స చేయించాలని డిమాండ్ చేశారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కొట్టుకొచ్చిన మృతదేహాలు
నగరంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో బేగంపేట పరిధిలో నాలాలు పొంగటంతో అందులో పడి ఇద్దరు యువకులు మృతిచెందారు. బుధవారం బేగంపేటలోని కూకట్‌పల్లి నాలాలో ఇద్దరు వ్యక్తుల మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. మృతుల వద్ద లభించిన ఆధారాలను బట్టి వారు ఒడిశాకు చెందిన చంద్రపాండా(38), మనోజ్ దాస్(45)గా గుర్తించారు. వీరు ఓల్డ్ కస్టమ్స్ బస్తీలో ఓ గదిని అద్దెకు తీసుకొని అమీర్‌పేటలో ఓ హోటల్‌లో పనిచేస్తున్నట్లు తెలిసింది. హోటల్ విధులు ముగించుకొని గ్రీన్‌ల్యాండ్ సమీపంలోని కంట్రీక్లబ్ వద్ద ఉన్న వైన్‌షాపులో మద్యం సేవించి, తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో నాలాలో పడి ఉంటారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






