18 April, 2026 | 8:04 PM

ఫీటు లెక్కన ఆర్‌ఆర్ ట్యాక్స్

09-05-2024 02:21 AM

చదరపు ఫీటుకు రూ.౭౫ కట్టాలట 

రియల్ ఎస్టేట్‌కు ముఖ్యమంత్రి హుకుం

కాంగ్రెస్ రాగానే రియల్ ఢమాల్ 

బీఆర్‌ఎస్‌కు డజను ఎంపీలివ్వండి

వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే 

పటాన్‌చెరు, నర్సాపూర్ సభల్లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్

నర్సాపూర్/పటాన్‌చెరు/సంగారెడ్డి, మే 8: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను దోపిడీ చేస్తున్నదని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగా నే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం ఢమాల్ అన్నదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద ఫీట్ల చొప్పున లెక్కగట్టి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చదరపు అడుగుకు రూ.౭౫ ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని విమ ర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని నర్సాపూర్, పటాన్‌చెరులో బుధవారం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. ప్రధాని నరేంద్రమోదీ పదేండ్ల పాలనలో దేశం సత్తేనాష్ అయ్యిందని ఆరోపించారు మోదీ ఆరాటమంతా అదానీ, అంబానీల కోసమేనని విమర్శించారు. 

తెలంగాణను ఆగం చేసిన కాంగ్రెస్

చావు నోట్లో తలపెట్టి తెచ్చుకున్న తెలంగాణ తెల్లగా అవుతున్న తరుణంలో కాంగ్రెస్ వచ్చి ఆగంపట్టిచ్చిందని కేసీఆర్ విమర్శించారు. తన ప్రాణం ఉన్నంతవరకు తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసమే కొట్లాడుతానని తేల్చి చెప్పారు. తెలంగాణకు అన్యాయం జరుగనివ్వనని అన్నారు. ‘కాంగ్రెస్‌వాళ్లు ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపించారు. 420 హమీలు ఇచ్చిర్రు. ఉచిత బస్సులు ఇచ్చి మహిళలు కొట్టుకునేలా చేశారు. ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునేలా చేశారు. ప్రతి మహిళకు రూ.2500 రాలే. రూ.౨ లక్షల రుణమాఫీ జరగలే. పెన్షన్ రూ.4 వేలు పెంచకపోగా ఒక నెల పెన్షన్ మింగేశారు.

ఇచ్చిన హామీలను అడిగితే సీఎం రేవంత్‌రెడ్డి దేవుళ్ల మీద ఒట్లు.. కేసీఆర్ మీద తిట్లు పనిగా పెట్టుకున్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదు. కేసీఆర్ కిట్లు బందయ్యాయి. తులం బంగారం ఇస్తలేరు. సీఎంఆర్‌ఎఫ్ కూడా బంద్ అయ్యింది. కాం గ్రెస్ వచ్చినంక కరెంటు కోతలతో పరిశ్రమ లు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నయి. కృష్ణ, గోదావరి నీళ్లు మనకే ఉండాలన్నా.. పరిశ్రమలు మన దగ్గరే ఉండాలన్నా మెదక్ నుం చి వెంకట్రామ్‌రెడ్డిని గెలిపించండి’ అని కో రారు.  

సామాన్యుల నడ్డి విరిచిన మోదీ

ప్రధాని మోదీ అచ్చేదిన్ అంటూ పెట్రో లు, గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచారని కేసీఆర్ విమర్శించారు. మోదీ చెప్పేదంతా గ్యాస్ ట్రాష్ అని ఎద్దేవా చేశారు. ‘పాకిస్థాన్‌ను చూపించి ప్రజలను మోదీ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుండు. ఆ దేశం ఎంతుంది? గట్టిగా బెదిరిస్తే ఇరవైఐదు ఏండ్లదాకా మన దగ్గరికి రాదు’ అని ఆరోపించారు. నర్సాపూర్‌లో కార్నర్ మీటింగ్‌లో మాట్లాడుతూ.. ఢిల్లీలో ధర్నా చేసిన 750 మంది రైతులను మోదీ పొట్టనపెట్టుకున్నారని. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు రావడం తో క్షమాపణలు చెప్పారని గుర్తు చేశారు. ప్రచారంలో బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, చింత ప్రభాకర్, సునితారెడ్డి, ఫారుక్ హుస్సేన్, వెంకట్రామ్‌రెడ్డి పాల్గొన్నారు. 

ఐదు నెలల్లోనే తలకిందులు చేశారు: కేసీఆర్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 8 (విజయక్రాంతి) : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే తెలంగాణ పరిస్థితులను తలకిందులు చేశారని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మోదీ పాలన అచ్చేదిన్ ఏమో కానీ సచ్చేదిన్ వచ్చిందన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని దుండిగల్ లో రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ కేజ్రీవాల్, కవితను అరెస్టు చేస్తే అమెరికా లాంటి దేశాలు విమర్శించయన్నారు. దేశంలో బీజేపీ పాలన అంతా ఓ ట్రాష్ అన్నారు. గోదావరి, కృష్ణా నదీ జలాలు మనకు దక్కాలంటే ఎంపీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి లాంటి కొట్లాడే వీరులను గెలిపించాలన్నారు. కాంగ్రెస్ ఐదునెలల కాలంలో భూముల ధరలు ఎందుకు పడిపోయినాయో ప్రజలు ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ ఆగమైందన్నారు.

హైదరాబాద్ జంట నగరాలకు నీళ్లు కరెంటు ఆగకుండా ఇచ్చిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిది అన్నారు. నిత్యం కరెంటు పోతుండటంతో తెలంగాణ రాష్ట్ర పరువు పోతున్నదన్నారు. పరిశ్రమలు తరలిపోతున్నాయన్నారు. ఈ ముఖ్యమంత్రి రియల్ స్టేట్ వాళ్ల దగ్గర ఆర్‌ఆర్ టాక్స్ వసూల్ చేస్తున్నాడని, స్కేర్ ఫీట్ ఇంత అని వసూల్ చేసి ఢిల్లీకి పంపుతున్నాడని స్వయంగా ప్రధానమంత్రి చెప్పిండన్నారు. అవినీతితో రాష్ట్ర పరువు పోతున్నదన్నారు. పార్లమెంటులో బీఆర్‌ఎస్ ఎంపీలు డజన్ మంది ఉంటేనే తెలంగాణ హక్కులు కాపాడుతారన్నారు. డజన్ పై చిలుకు సీట్లు గెలవబోతున్నామన్నారు. కాంగ్రెస్ చేసిన మోసం జనాలకు అర్థమైందన్నారు. అనుకోకుంటా పెట్టుకున్న ఈ మీటింగ్ ప్రజలు పెద్ద ఎత్తున రావడం బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపునకు సంకేతం అన్నారు.