జాతీయ జెండా ఘటనపై అసత్య ప్రచారం జరుగుతోంది
సర్పంచ్ జంగిలి సునీత సాంబయ్య
మునుగోడు, జూన్ 5: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుండ్లోరిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో తన భర్త జంగిలి సాంబయ్య జాతీయ జెండా ఎగురవేశారంటూ కొన్ని పత్రికల్లో ప్రచురితమైన వార్తలు పూర్తిగా అవాస్తవమని గుండ్లోరిగూడెం సర్పంచ్ జంగిలి సునీత సాంబయ్య స్పష్టం చేశారు.
వివరణ ఇచ్చేందుకు స్థానిక తాసిల్దార్ ఎంపీడీవోకు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. గ్రామంలో జాతీయ పండుగలు, ప్రభుత్వ కార్యక్రమాల సందర్భంగా జాతీయ జెండాకు ఎల్లప్పుడూ గౌరవం ఇస్తూ నిబంధనల ప్రకారమే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జెండా ఎగురవేతకు సంబంధించిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, గన్నేరు చెట్టు కొమ్మ అడ్డుగా ఉండటంతో దానిని తొలగించే క్రమంలో జరిగిన సంఘటనను కొందరు వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
దళిత బిడ్డ అయిన తన భర్తపై కొందరు నాయకులు కావాలనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులను అడ్డుకోవడం, రాజకీయ ప్రయోజనాలు పొందడమే లక్ష్యంగా కొందరు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని విమర్శించారు. తన భర్త జంగిలి సాంబయ్య గత ఐదు సంవత్సరాల పాటు ఉపసర్పంచ్గా గ్రామానికి సేవలందించారని, ఆయన సేవలను గుర్తించిన గ్రామ ప్రజలే జనరల్ మహిళా కోటాలో తనను సర్పంచ్గా ఎన్నుకున్నారని తెలిపారు.
ఈ విషయాన్ని జీర్ణించుకోలేక కొందరు నాయకులు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ గ్రామ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. వాస్తవాలను పరిశీలించిన తరువాతే వార్తలను ప్రచురించాలని పత్రికా విలేకరులకు ఆమె విజ్ఞప్తి చేశారు.






