31 July, 2026 | 12:52 AM

రహానే అల్విదా

31-07-2026 12:01 AM
  1. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
  2. భావోద్వేగంతో రిటైర్మెంట్ పోస్ట్
  3. 15 ఏళ్ల కెరీర్‌కు ముగింపు 
  4. ఓటమెరుగని సారథిగా ఘనత

భారత క్రికెట్‌లో ఒక శకం ముగిసింది. సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సోష ల్ మీడియా వేదికగా రిటైర్మెంట్ నిర్ణయా న్ని ప్రకటిస్తూ భావోద్వేగానికి గురయ్యాడు. మిస్టర్ కన్సిస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్న రహానే 15 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో చిరస్మరణీ య ఇన్నింగ్స్‌లు ఆడాడు. వివాదాలకు దూరంగా, హుందాతనంతో జెంటిల్మెన్ గేమ్‌లో జెంటిల్మెన్‌గా పేరున్న రహానే స్థా నాన్ని భర్తీ చేయడం కష్టమే.

ముంబై, జూలై 30 : క్రికెట్‌లో ఆటగాడి నైపుణ్యం టెస్ట్ ఫార్మాట్‌తోనే తెలుస్తుంది. వన్డేల్లో అయితే 50 ఓవర్లే... టీ20ల్లో అయి తే 20 ఓవర్లే కానీ టెస్ట్ క్రికెట్‌లో రోజుకు 90 ఓవర్లు, ఐదు రోజుల పాటు గ్రౌండ్‌లోనే ఉండాలి. అది కూడా ఎంతో సహనంతో బ్యాటింగ్ చేయాలి. ద్రవిడ్, లక్ష్మణ్, పుజారా తర్వాత భారత టెస్ట్ జట్టులో అత్యంత నమ్మదగిన బ్యాటర్ ఎవరంటే మరో ఆలోచన లే కుండా రహానే పేరు చెబుతారు. ఎందుకంటే టెస్టుల్లో రహానే క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది మరి.

జాతీయ జట్టులో ప్లేస్ ఉన్నా లేకున్నా దేశవాళీ క్రికెట్‌లో ఎప్పటికప్పుడు తనదైన ముద్ర వేస్తూనే ఉన్నాడు. తన కెరీర్‌లో రహానే ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్ లు ఆడాడు. క్రీజులో నిలదొక్కుకున్నాడంటే అతన్ని ఔట్ చేయడం చాలా కష్టం. ప్రత్యర్థి బౌలర్లకు ఈ విషయం బాగా తెలుసు. ఒత్తిడిలో రాణించే అద్భుతమైన బ్యాటింగ్ శైలి రహానే సొంతం. 38 ఏళ్ల ర హానే 2011లో ఇంగ్లాండ్‌పై అంతర్జాతీయ అ రంగేట్రం చేశాడు. తన 15 ఏళ్ల సుధీర్ఘమైన కెరీర్‌లో 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 లు ఆడాడు.

టెస్టుల్లో 5077 పరుగులు చే యగా దీనిలో 12 సెంచరీలు, 26 హాఫ్ సెం చరీలున్నాయి. అలాగే వన్డేల్లో 2962 పరుగులు ( 3 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు), టీ20ల్లో 375 పరుగులు చేశాడు. కేవలం బ్యాటర్‌గానే కాకుండా కెప్టెన్‌గానూ రహానే విజయవంతమయ్యాడు. సైలెంట్ కెప్టెన్సీతో, వివాదాలకు దూరంగా , హుందాాగా వ్యవహరించిన సారథిగా రహానేకు గుర్తింపుంది. రహానే కెరీర్‌లో 2020  ఆస్ట్రేలియా ప ర్యటన అద్భుతమనే చెప్పాలి.

అడిలైడ్ టెస్టు లో కేవలం 36 పరుగులకే కుప్పకూలి భా రత్ ఘోర అవమానాన్ని ఎదర్కొన్న వేళ అప్పటి కెప్టెన్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో జట్టును వీడాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సారథ్య బాధ్యతలు అందుకున్న రహానే యువ ఆటగాళ్లతో జట్టును అద్భుతంగా నడిపించాడు. మెల్‌బోర్న్‌లో కెప్టెన్‌గా బాధ్యతా యుతమైన 112 పరుగులు చేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. చారిత్రక గబ్బా మైదానంలో ఆస్ట్రేలియాకు ఉన్న 32 ఏళ్ల అజేయ రికార్డును బద్దలు కొట్టి 2 సిరీస్‌ను గెలిపించాడు.

భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓటమి ఎరుగని కెప్టెన్‌గా రహానేకు అరుదైన రికార్డు ఉంది.  అలాగే  విదేశాల్లో పర్యటించినప్పుడు రహానే అత్యంత నమ్మకమైన బ్యాటర్ గా నిలిచాడు. ముఖ్యంగా సేనా దేశాల్లో పర్యటించినప్పుడు ఏన్నో సార్లు అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో జట్టును కాపాడాడు.  ఏది ఏమైనా రహానే లాంటి గొప్ప బ్యాటర్ మళ్లీ భారత జట్టులో కనిపించడం కష్టమే