రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం
వరంగల్ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స
జనగామ,(విజయక్రాంతి): తరిగొప్పుల మండలం బొంతగట్టు నగరం గ్రామానికి చెందిన రైతు పిల్లి రవి కుమార్ రోడ్డు నిర్మాణం కారణంగా తన పొలం కోల్పోతాననే ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గతంలో వ్యవసాయ బావుల వద్దకు వెళ్లేందుకు రైతులందరూ కలిసి ఒక బాటను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఆ బాటలోనే బీటీ రోడ్డు వేస్తుండటంతో 15-20 గుంటల భూమి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎక్కువగా నష్టపోతున్నది తానేనని రవి కుమార్ ఆవేదన చెందాడు.
మానసిక క్షోభతో ఆత్మహత్యాయత్నం చేసిన రవి కుమార్‌ను కుటుంబ సభ్యులు వెంటనే వరంగల్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది. రైతులకు ప్రత్యామ్నాయ మార్గం చూపకుండా రోడ్డు వేయడంతోనే ఈ ఘటన జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.






