గిరిజన రైతు గోస తీరేనా?
గోల్డ్ లోన్‌కు.. సోసైటీ అప్పునకు లింక్ పెడుతున్న డీసీసీబీ
సొసైటీ అప్పు క్లియర్ చేస్తేనే గోల్డ్ లోన్ రెన్యువల్ చేస్తామంటూ హుకుం
వారం రోజులుగా బ్యాంక్ చుట్టూ రైతు ప్రదక్షిణలు
పలానా తేదిని ఇస్తానని అగ్రిమెంట్ రాసి ఇచ్చిన బ్యాంక్
డీసీసీబీ బ్యాంక్ వైఖరిపై రైతుల ఆగ్రహం..
అకౌంట్ వేరు అయినా బలవంతంగా రూ.10,000 చెల్లింపు
కూసుమంచి, మార్చి 10(విజయక్రాంతి): వ్యవసాయ పనుల ఖర్చుల కోసం రైతులు తమ బంగారు ఆభరణాలను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటారు. బంగారం పెట్టారంటే వెంటనే ఒక్కరోజులోనే రైతుకు రుణం మంజూరు చేయాల్సి ఉంటుంది.. ఇచ్చిన రుణానికి సంవత్సరం లోపు రైతు రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంది.. రైతు ఇష్టంగా బంగారు ఆభరణాలపై ఇచ్చిన రుణాన్ని బ్యాంకుల వారు రెన్యువల్ చేయాల్సిందే.. కానీ కూసుమంచి డీసీసీబీ బ్యాంక్ లో మాత్రం అందుకు విరుద్దంగా నడుస్తోంది.
బంగారు రుణాన్ని రెన్యువల్ చేయాలని బ్యాంక్ కు వెళ్లిన రైతుకు డీసీసీబీ బ్యాంక్ షాక్ ఇచ్చింది.. అక్కడ రుణం చెల్లిస్తే..ఇక్కడ రెన్యువల్ చేస్తామంటూ బ్యాంక్ రైతుకు హుకుం జారీ చేశారు.. దీంతో రైతు అవాక్కై మీడియాకు గోడును విన్నవించుకున్నాడు.. రైతు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కూసుమంచి మండలం లోక్యాతండా గ్రామానికి చెందిన వడ్తియా మల్సూర్ అనే రైతు గత సంవత్సరం మండల కేంద్రంలోని డీసీసీబీ బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకున్నాడు.
వాటిని వ్యవసాయ పనులకు ఉపయోగించాడు.. ఏడాది సమయం అవుతుండటంతో రైతు గత ఐదు రోజుల క్రితం డీసీసీబీ బ్యాంక్ వద్దకు వెళ్లి గోల్ లోను రెన్యువల్ చేయాలని బ్యాంక్ వారిని కోరాడు. దీంతో బ్యాంక్ వారు రైతుకు షాక్ ఇచ్చారు. నీకు కల్లూరుగూడెం సోసైటీలో క్రాఫ్ లోను అప్పు ఉందని, ముందుగా ఆ అప్పు క్లియర్ చేస్తేనే గోల్ లోన్ రెన్యువల్ చేస్తామని బ్యాంక్ మేనేజర్ చెప్పినట్లు రైతు మీడియాకు తెలిపారు. పంట డబ్బులు ఇంకా రాలేదు.. రాగానే చెల్లిస్తానని రైతు బ్యాంక్ వద్ద ఎంత మొరపెట్టుకున్నప్పటికి ఫలితం లేకపోయింది.. రైతు వేదన బ్యాంక్ వారికి వినిపించలేదు.
రైతు వారం రోజులుగా బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని, కచ్చితంగా సోసైటీ లో ఉన్న రుణాన్ని చెల్లిస్తేనే బంగారం పై తీసుకున్న రుణాన్ని రెన్యువల్ చేస్తామని తెల్చి చెప్పినట్లు రైతులు మీడియాకు తెలిపారు. అప్పటికప్పుడు రూ.10వేలు చెల్లించిన సైటీకి సంబంధించిన బకాయిల్లో భాగంగా రూ.10,000 డీసీసీబీ బ్యాంకు ఖాతాలో చెల్లించాల్సిందిగా రైతును బ్యాంక్ వారు ఒత్తిడి చేశారని రైతు తెలిపాడు. దీంతో రైతు అప్పటికప్పుడు బయట అప్పు చేసి రూ.10వేలను సోసైటీ అప్పును చెల్లించాడు.
అయినప్పటికి మిగిలిన అప్పు కూడా 20 రోజుల్లో చెల్లిస్తామని అగ్రిమెంట్ రాసి బ్యాంకులో ఇవ్వాలని రైతుపై ఒత్తిడి చేశారు. దీంతో రైతు చేసేది లేక 20 రోజులు గడువు ఇవ్వాలని, ఆ లోపు క్రాఫ్ లోను చెల్లిస్తానని రైతు అగ్రిమెంట్ రాసి ఇచ్చాడు. ఇంత జరిగినప్పటికీ రైతుకు గోల్ లోన్ రెన్యువల్ చేయకుండా బ్యాంకు చుట్టూ తిప్పుతున్నారని రైతు ఆరోపిస్తున్నాడు. ప్రభుత్వం, అధికారులు స్పందించి నాకు న్యాయం చేయాలని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
బ్యాంక్ పై రైతులు ఆగ్రహం
అత్యవసరంగా వ్యవసాయానికి డబ్బులు అవసరమైన సమయంలో బంగారు అభరణాలను బ్యాంక్ లో పెట్టి రుణాలు తీసుకుంటే, మరోక సోసైటీలో ఉన్నఅప్పును సాకుగా చూపుతూ రైతులను ఇబ్బంది పెట్టడంపై రైతులు, రైతు సంఘాల నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఇబ్బందులు పెట్టడం వల్ల రైతు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్థులు తెలిపారు.
వ్యవసాయ పనులు, కుటుంబ అవసరాల కోసం రైతులు తమ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటున్నారని, అలాంటి సమయంలో బ్యాంకు అధికారులు సహకరించాల్సి ఉండగా అడ్డంకులు సృష్టించడం అన్యాయమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి డీసీసీబీ బ్యాంకు మేనేజర్ వైఖరిపై విచారణ జరిపి రైతుకు న్యాయం చేయాలని రైతులు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రైతులకు సహాయం చేయాల్సిన బ్యాంకు అధికారులు ఇబ్బందులు కల్పించడం దురదృష్టకరమని వారు పేర్కొన్నారు.




