13 June, 2026 | 10:35 PM

భారీ వర్షానికి తడిసిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల విజ్ఞప్తి

13-06-2026 09:34 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దైంది. మండల కేంద్రంతో పాటు శివంగలపల్లి పలు గ్రామాలలో  కొనుగోలు కేంద్రం వద్ద నిల్వ ఉంచిన దాదాపు ఆరు లారీలకు సరిపడే ధాన్యం బస్తాలు వర్షపు నీటిలో తడవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం, ధాన్యం తూకం వేసినప్పటికీ లారీలు రాకపోవడంతో బస్తాలు వారం రోజులుగా కొనుగోలు కేంద్రంలోనే కుప్పలుగా పేరుకుపోయాయి.

ఇదే సమయంలో ఇదురు గాలులు కురిసిన భారీ వర్షం కారణంగా ధాన్యం పూర్తిగా తడిసిపోవడంతో నాణ్యత దెబ్బతింటుందనే ఆందోళన నెలకొంది.వర్షాకాలం ప్రారంభమై దాదాపు 20 రోజులు గడిచినా ధాన్యం కొనుగోలు ప్రక్రియ మందగించిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షానికి తడిసి నష్టపోవడంతో తమకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని వారు వాపోయారు.తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ధాన్యాన్ని తరలించేందుకు వెంటనే లారీలను పంపించాలని రైతులు కోరుతున్నారు. జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులు చొరవ తీసుకుని ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.