అన్నదాతకు అరిగోస!
సాగు మొదలు ధాన్యం అమ్మే వరకూ అష్టకష్టాలు
మక్కలు కొనే దిక్కు లేదు
ధాన్యం వైపు చూసే నాథుడు లేడు
సర్కార్ పట్టించుకోవాలని రైతుల విజ్ఞప్తి
మహబూబాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): ఆరుగాలం అష్ట కష్టాలు పడి పండించిన పంట ఉత్పత్తులను ఇప్పుడు విక్రయించడానికి అన్నదాతలు రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో యాసంగి సీజన్ లో 1.53 లక్షల ఎకరాల్లో వరి సాగు విస్తీర్ణం జరిగింది. ఎస్సారెస్పీ ద్వారా గోదావరి జలాల విడుదలతో జిల్లాలోని దాదాపు చెరువులు కుంటలన్నీ జలకలను సంతరించుకున్నాయి.
దీనితో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండడంతో యాసంగి వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ప్రభుత్వం సన్నధాన్యానికి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ప్రకటించడంతో, యాసంగి పరిసాగులో అధిక విస్తీర్ణం సన్న రకం సాగు చేశారు. పంట కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా పంట కోతలు ప్రారంభించిన రైతులు పంట ఉత్పత్తులను విక్రయించడానికి తమ గ్రామాల్లో ఏర్పాటు చేసే ప్రతిపాదిత కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చి కొనుగోళ్ల కోసం నిరీక్షిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా 204 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు. ఇప్పటికే పలు చోట్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా, చాలా చోట్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాల్సి ఉంది. దీనితో ధాన్యం కొనుగోళ్లకు రైతులు నిరీక్షిస్తున్నారు. త్వరగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తే ఇబ్బంది లేకుండా పోతుందని, లేదంటే ఒక్కసారిగా రైతులు తెచ్చే ధాన్యంతో ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.
మక్కలది అదే తీరు!
అలాగే జిల్లా వ్యాప్తంగా మక్కజొన్న పంట సాగు విస్తీర్ణం కూడా 1.49 లక్షల ఎకరాల్లో సాగయింది. ఇది కూడా పంట దిగుబడి అధికంగా వస్తోంది. అయితే జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను మార్క్ఫెడ్ సంస్థ 18 చోట్ల మాత్రమే ఏర్పాటు చేసింది. దీనితో రైతులు మొక్కజొన్న విక్రయ కేంద్రాలను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన మక్కలతో నిండిపోయాయి. వివిధ మార్కెట్లలో మక్కలు పేరుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు కొత్తగా 20 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి అధికార యంత్రాంగం ప్రతిపాదనలు పంపించడంతో రైతులు ఆయా ప్రతిపాదిత కొనుగోలు కేంద్రాలకు మక్కలను తెచ్చి రోజుల తరబడిగా విక్రయానికి నిరీక్షిస్తున్నారు. అటు ధాన్యం, ఇటు మక్కల కొనుగోళ్లకు వెంటనే చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
నెల రోజుల నుంచి నిరీక్షణ
మక్కల పండించి కొనుగోళ్ల కోసం నెల రోజుల నుంచి నిరీక్షిస్తున్నాం. ప్రైవేటు వ్యాపారులు మక్కలు క్వింటాలుకు 1,700 రూపాయల ధర మాత్రమే పెడుతున్నారు. గవర్నమెంట్ క్వింటాలుకు 2,400 రూపాయల ధర పెడుతుండటం వల్ల ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు మక్కలను తెచ్చాము. అయితే ఇప్పుడు..అప్పుడు అంటూ రోజుల కమానం వాయిదా వేస్తున్నారే తప్ప కొనుగోలు చేయడం లేదు. వెంటనే మక్కల కొనుగోళ్లకు శ్రీకారం చుట్టాలి.
- తాళ్ళ పూస పల్లి, రైతులు
కొనుగోళ్లకు చర్యలు
ధాన్యం కొనుగోళ్లకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. 204 కేంద్రాలకు గాను, కొన్ని చోట్ల కొనుగోళ్లు ప్రారంభించాం. మిగిలిన చోట్ల కూడా శనివారం లోగా ప్రారంభిస్తాం. ఇక ఇప్పటికే 18 చోట్ల మక్కలు కొనుగోలు చేస్తున్నాం. విస్తీర్ణం, దిగుబడి గణనీయంగా పెరిగింది. అందుకు అదనంగా ప్రత్యేకంగా మక్కల కొనుగోళ్లకు మరో 20 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాము. అనుమతి రాగానే ప్రతిపాదిత ప్రాంతాల్లో మక్కల కొనుగోళ్లకు కూడా చర్యలు తీసుకుంటాం.
కే.అనిల్ కుమార్, అదనపు కలెక్టర్
సరిత, డీఏఓ, మహబూబాబాద్
ఎండలో ఇబ్బందులు
ఎండలో ఇబ్బందులు పడుతున్నాం. రైతులకు కనీసం తాగునీటి వసతి లేదు. ధాన్యం ఆరబెట్టడానికి యంత్రాలు ఇవ్వలేదు. నిలువ నీడలేక ఎండలో అల్లాడుతున్నాం. కొనుగోలు కేంద్రం వెంటనే ప్రారంభించాలి. అన్ని ఏర్పాట్లు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి. నాణ్యత పరిశీలించి కొనుగోలుకు ఆమోదయోగ్యమైన ధాన్యానికి టోకెన్లు, గన్నీ సంచులను ఇవ్వాలి.
దాసరి యాదగిరి, ధాన్యం రైతు, ముడుపుగల్లు






