19-02-2026 12:46:18 AM
యూరియా కోసం రైతు గోస
సెకండ్లలో మాయమైతున్న యాప్
యూరియా కోసం అవస్థలు పడుతున్న రైతులు
యూరియా అందుబాటులో ఉంచాలని వేడుకోలు
వేములపల్లి, ఫిబ్రవరి 18: పంట సాగు చేసే రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. పంటను మంచిగా పెంచుదామన్న రైతుకు యూరియా కష్టాలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం ఆన్లైన్ ద్వారానే ప్రతి రైతుకు యూరియా అందించేందుకు గాను ఆన్లైన్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. కానీ ఈ విధానంలో రైతులకు సరైన సమయంలో బుకింగ్ కాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
క్షణాల్లో యాప్ క్లోజ్
పిఎసిఎస్, అగ్రికల్చర్ అధికారులు యూరియా అందుబాటులో పలానా టయానికి వస్తుందని చెప్పడంతో ఇదే పనిగా పెట్టుకున్న రైతులు యాప్ ఓపెన్ అయ్యే సమయానికి సెకండ్ల వ్యవధిలోనే ఈ యాప్ క్లోజ్ అవ్వడంతో తీవ్ర అసహనానికి గురవుతున్నారు.రైతులు యూరియా కోసం ఈ యాప్ ఓపెన్ చేయగా సెకండ్లలో యాప్ క్లోజ్ అవుతుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ యూరియా బుక్ చేసుకున్న అది ఏ ప్రాంతాలలో వస్తున్నదో అర్థం కావడం లేదని రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం పారదర్శకంగా రైతులకు యూరియా అందించేందుకు మొబైల్ యాప్ ను పెట్టింది. అయితే క్షేత్రస్థాయిలో రైతులకు అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
యూరియా వినియోగం అధికమే
ప్రస్తుత యాసంగి సీజన్లో తీవ్ర కూలీల కొరత ప్రభావంతో నాటు కూలీలు వేసే మహిళలు కూలీ రేట్లు పెంచడంతో ఆర్థిక భారం మోయలేక రైతులు డ్రం సీడర్, వెదజల్లే పద్ధతిలో వేల ఎకరాలలో సాగు చేశారు. ఈ విధానంలో విత్తిన పంటకు యూరియా ఎక్కువ మోతాదులో అవసరమవుతుంది. అది కూడా 15 నుండి 20 రోజుల వ్యవధిలో కాలంలోనే యూరియా డోసు వరి పొలానికి అందించాలి. ప్రస్తుత యాప్ వల్ల సరైన సమయానికి యూరియా దొరకకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ యాప్ కష్టాలను దూరం చేసి యూరియా సరళంగా దొరికే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
తిప్పలు తప్పడం లేదు
ఫోన్లో యూరియాను ఎట్లా కొనుగోలు చేయాలో అర్థం కావట్లేదు. నాలాంటి రైతులు అవగాహన తో ఆన్లైన్లో బుక్ చేయడానికి నానా తిప్పలు పడుతున్నారు. ఈ టయానికి యూరియా వస్తుందో ఎప్పుడు బుక్ చేసుకోవాలి అర్థం కావడం లేదు. యాప్ చూసుకుంటూ కూసుంటే పొలం పనులు చేసే అవకాశం లేకుండా పోయింది. వ్యవసాయ అధికారులు శెట్టి పాలెం పిఎసిఎస్ కేంద్రంలో గత మంగళవారం సాయంత్రం 6 గంటలకు యూరియా అందుబాటులో ఉంటుందన్నారు. యాప్ ను ఓపెన్ చేసే లోపే 15 సెకన్లలోనే యూరియా అయిపోయినట్టు చూపించింది. దీంతో యూరియా కోసం తీవ్ర అవస్థలు పడాల్సి వస్తుంది.
- రైతు దాసరి మల్లయ్య యాదవ్