ప్రాజెక్టులు ఉన్నా.. పొలాలకు నీరేదీ?

05-10-2026 | 05:30am
  1. మారేళ్లపాడు నీటికి ఆలస్యం.. తుమ్మలచెరువు లిఫ్టింగ్ ఫలితం శూన్యమేనా?
  2. నెర్రెలు బారుతున్న వరి.. ముడుచుకుంటున్న పత్తి.. పెట్టుబడి చేతికొస్తుందా?

అశ్వాపురం, అక్టోబర్ 4 (విజయక్రాంతి): సాగునీటి సమస్యను(irrigation water problem) పరిష్కరించేందుకు ప్రాజెక్టులు, లిఫ్టింగ్ పథకాలు ఉన్నా.. పంటకు అవసరమైన సమయంలో నీరు అందకపోతే రైతుకు వాటి ప్రయోజనం ఏమిటన్న ప్రశ్న అశ్వాపురం మండలంలో తలెత్తుతోంది. మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం ద్వారా నీరు అందుతుందన్న ఆశ రైతుల్లో ఉన్నప్పటికీ, సకాలంలో నీరు అందక కొన్ని పొలాలు నెర్రెలు బారుతున్నాయని రైతులు చెబుతున్నారు.

మరోవైపు పత్తి పంట కూడా నీటి లభ్యత, వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల కోసం పెట్టుబడి పెట్టిన రైతులకు పంట కీలక దశలో నీరు అందకపోతే దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో తుమ్మలచెరువుకు నీటిని ఎత్తిపోసే లిఫ్టింగ్ చేపట్టినా.. ఆ నీరు రైతు పంటకు సకాలంలో అందకపోతే ఆ లిఫ్టింగ్ ఫలితం ఏమిటన్నదే అసలు ప్రశ్న. నీటిని ఎత్తిపోశామా లేదా అన్నది కాకుండా..

ఆ నీరు ఎన్ని ఎకరాలకు చేరింది, పంట అవసరాన్ని ఎంతవరకు తీర్చింది, ఇంకా ఎన్ని ఎకరాలు నీటి కోసం ఎదురు చూస్తున్నాయి అన్నదే రైతుకు ముఖ్యం. ప్రాజెక్టుల ద్వారా నీటి విడుదలపై లెక్కలు చెప్పడం కంటే క్షేత్రస్థాయిలో చివరి పొలానికి నీరు చేరిందా లేదా అన్నదానిపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మారేళ్లపాడు ప్రాజెక్టు, తుమ్మలచెరువు లిఫ్టింగ్ ద్వారా అందిన నీటి పరిమాణం, సాగులోకి వచ్చిన ఆయకట్టు,

నీరు అందక ప్రభావితమైన పంట విస్తీర్ణంపై సమగ్ర వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని రైతులు కోరుతున్నారు. నీరు వచ్చిన తర్వాత పంట కాపాడితేనే ప్రాజెక్టు సార్థకం.. పంట దెబ్బతిన్న తర్వాత నీరు వస్తే ప్రయోజనం ఎంత? అనే ప్రశ్న ఇప్పుడు రైతుల్లో వినిపిస్తోంది. నీటి లభ్యత, విద్యుత్ సరఫరా, పంట పరిస్థితి, రైతు పెట్టుబడి, దిగుబడి అంశాలను సమగ్రంగా పరిశీలించి సకాలంలో సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు