సందిగ్ధంలో గణపసముద్రం సరస్సు ఆయకట్టు రైతులు
*17 అడుగులకు చేరిన నీటిమట్టం
*పంటలకు నీరు వదలం అంటున్న ఐబీ అధికారులు
*ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు
గణపురం, ఆగస్టు 2 (విజయక్రాంతి): ఈ వ్యవసాయ సీజన్ లో సమృద్ధిగా వర్షాలు కురవకపోవడంతో గణప సముద్రం సరస్సు ఆయకట్టు రైతులు సందిగ్ధంలో ఉన్నారు. గత మూడు రోజులుగా తుఫాను వల్ల కురిసిన వర్షం పై ఆశలు పెంచుకున్న రైతులకు నిరాశే మిగిలింది. సరస్సు పూర్తి సామర్థ్యం 30 అడుగులు కాగా తుఫాను వర్షానికి ముందు కేవలం 15 అడుగుల నీరు మాత్రమే నిల్వ ఉంది. తుఫాను వర్షం వల్ల కేవలం రెండు అడుగుల నీరు మాత్రమే సరస్సులోకి చేరడంతో ప్రస్తుత నీటిమట్టం 17 అడుగుల వద్ద ఉంది.
వర్షాలు కురుస్తాయని నమ్మకంతో రైతులు సకాలంలో వరి నారులు పోసుకొని దుక్కులు సిద్ధం చేసుకున్నారు. గతంలో సరస్సు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటే మూడు పంటలు పండేవి కానీ ప్రస్తుతం మిషన్ భగీరథ పంపింగ్ వల్ల ఎనిమిది మండలాలకు గణప సముద్రం సరస్సు నీటిని తరలిస్తుండడంతో ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. రామప్ప సరస్సు నుండి దేవాదుల పైప్ లైన్ ద్వారా గ్రావిటీ కెనాల్ ఏర్పాటు చేసి నీటిని గణపసముద్రం సరస్సుకు తరలించాల్సి ఉండగా ప్రస్తుతం దేవాదుల నీరు గణప సముద్రానికి రాకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. దేవాదుల నీటిని గణపసముద్రానికి తరలించే విషయంలో గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






