ఆయిల్‌పామ్ సాగుపట్ల అన్నదాతల ఆసక్తి
- తోడ్పాటుగా రాయితీలు
- పెరుగుతున్న సాగు విస్తీర్ణం
మహబూబాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో వాణిజ్య పంటల సాగులో ఆయిల్ పామ్ పంట సాగు ఇటీవల అనూహ్యంగా రోజురోజుకు పెరుగుతోంది. ఇతర పంటల సాగులో ఆశించిన దిగుబడి, ధరలు లభించకపోవడంతో ఆయిల్ పామ్ పంట సాగు వైపు అన్నదాతలు అధిక ఆసక్తి చూపిస్తున్నారు.
దీనికి తోడు ఆయిల్ పామ్ పంట సాగు కు ఎకరానికి 50వేల రూపాయల రాయితీని ప్రభుత్వం అందజేస్తుండడంతో రైతులు ఈ పంట సాగు వైపు అమితాసక్తి చూపిస్తున్నారు. కోతుల బెడద కూడా ఈ పంటకు లేకపోవడంతో ఆయిల్ పామ్ పంట సాగు ఇప్పుడు జిల్లాలోని దాదాపు అన్ని గ్రామాలకు విస్తరించింది.
పెరుగుతున్న ఆయిల్ పామ్ పంట సాగు విస్తీర్ణం
మహబూబాబాద్ జిల్లాలో గతంలో వాణిజ్య పంటల సాగులో అత్యధికంగా పసుపు, మిర్చి పంటలు నిలిచేవి. అయితే గత కొంతకాలంగా మిర్చి పంటలో ఆశించిన దిగుబడి, ధర కూడా తగ్గడం, పసుపు పంట పది నెలల పాటు కష్టపడ్డా ధర పెరగకపోవడం, చీడపీడల బెడద తీవ్రతరం కావడంతో ఆ పంటలను సాగు చేయడానికి అన్నదాతలు ఆసక్తి తగ్గించి, అందుకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ పంట సాగు వైపు దృష్టి సారించారు. ఫలితంగా ఇప్పుడు జిల్లాలోని 18 మండలాల్లో 2,200 మందికి పైగా రైతులు తొమ్మిది వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట సాగు చేపట్టారు. దీనితో జిల్లాలో ఆయిల్ పామ్ పంట సాగు విస్తీర్ణం రోజు రోజుకు విస్తరిస్తోంది.
ఆయిల్ పామ్ పంట సాగుకు రాయితీలు
ఎకరం భూమిలో ఆయిల్ పామ్ పంట సాగు కోసం అవసరమైన మొక్కలు ఇతర నిర్వహణకు మొదట్లో 11,600 రూపాయలను ఉద్యాన శాఖ ద్వారా ప్రభుత్వం రైతులకు అందజేస్తుంది. అలాగే మొక్కలు నాటిన మొదటి ఏడాది నుండి నాలుగేళ్లపాటు ప్రతి ఏడాది 4,200 చొప్పున పంటల సాగుకు నిర్వహణ కోసం రాయితీ అందజేస్తుంది. అలాగే బిందు సేద్యం కోసం అవసరమైన పరికరాలకు 22,518 రూపాయలను అందజేస్తోంది.
ఆయిల్ పామ్ పంట సాగుతో ఏడాదికి లక్ష రూపాయల నిఖర ఆదాయం
నీటి వసతి, పట్టా భూమి కలిగిన రైతులకు ఆయిల్ పామ్ పంట సాగు ప్రయోజనకరం. 30 ఏళ్ల పాటు వంటకాల విస్తీర్ణం ఉండటం వల్ల నీటి వసతి తప్పనిసరి. ప్రభుత్వ రాయితీల కోసం పట్టా భూమి తప్పనిసరి. ఉద్యాన శాఖ ద్వారా రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు అందిస్తాం. ఆయిల్ పామ్ గెలలకు కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కోతుల బెడద కూడా ఈ పంటకు ఉండదు. ఏటా ఎకరం పంట సాగులో ఖర్చులు పోను రైతులు లక్ష రూపాయల నిఖర ఆదాయం పొందవచ్చు. మార్కెటింగ్ సౌకర్యం కూడా అనుకూలంగా ఉంది.
- జినుగు మరియన్న,
జిల్లా ఉద్యాన శాఖ అధికారి,
మహబూబాబాద్




