20 April, 2026 | 4:07 AM

రైతులు రేవంత్ తోలుతీయాలి

20-04-2026 02:25 AM
  1. నాడు తరుగుతీస్తే తోలుతీస్తా అన్నావ్.. నేడు సీఎం అయ్యి ఏం చేస్తున్నావ్..
  2. కాంటాల వద్ద 5 కేజీలు, మిల్లుల వద్ద రెండు కేజీల తరుగుకు బాధ్యులెవరు?
  3. ఎమ్మెల్యేలు మిల్లర్లతో సమావేశమైన తర్వాత ధర తగ్గింది
  4. ధాన్యం అమ్మేందుకు రైతులు అష్టకష్టాలు పడుతుండ్రు
  5. రేవంత్ రైతుబంధుకు రామ్ రామ్ చెప్తుండు
  6. రానున్నది కేసీఆర్ ప్రభుత్వమే..
  7. మాజీ మంత్రి హరీశ్‌రావు

నల్లగొండ, ఏప్రిల్19 (విజయక్రాంతి): నాడు ప్రతిపక్షనేతగా ధాన్యం సెంటర్ల పరిశీలనకు వెళ్లిన రేవంత్‌రెడ్డి తరుగుతీస్తే... తోలుతీస్తా అని చెప్పిన రేవంత్‌రెడ్డి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత తాలుపేరిట తరుగు తీస్తున్నారని ఇప్పుడు రైతులు ఆయన తోలు తీయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. నల్లగొండ జిల్లాలోని తానేదార్ పల్లి వద్ద ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం గుర్రంపోడ్ మండల కేంద్రంలో ఆదివారం జరిగిన బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడికి పోయినా రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి... అనే మాటే వినిపిస్తోందన్నారు.

రాష్ట్రంలో రైతులు ధాన్యం అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తుందన్నారు. పది రోజులైనా కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొనే దిక్కు లేకుండా పోయిందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మిల్లర్ల వద్ద ముడుపులు తీసుకొని రైతుల పొట్ట కొడుతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్లతో సమావేశం అయిన తర్వాతనే ధర తగ్గిందన్నారు. రేవంత్ రెడ్డి 70 సార్లు ఢిల్లీకి వెళ్లి కప్పం కట్టి, సీఎం సీటును కాపాడుకుంటున్నారని తెలిపారు.

ఢిల్లీకి కప్పం కట్టే పనిలో ఆయన బాగా బిజీ అయ్యాడన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ధాన్యం సెంటర్‌ను కూడా సీఎం పరిశీలించలేదన్నారు. తాలు పేరిట తరుకుతీస్తున్నారని విషయం సీఎంకు ఇంటెలిజెన్స్ చెప్పడం లేదా అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో క్వింటాకు 5 కేజీలు, మిల్లుల వద్ద మరో రెండు కేజీలు తరుగు తీస్తున్నారని రైతులు చెప్తుంటే బాధ కలుగుతుందన్నారు. ‘ఇప్పటికే నాలుగు రైతుబంధులను ఎగ్గొట్టాడు.

క్రమంగా రైతుబంధుకు రాంరాం చెప్పే పనిలో ఉన్నాడు’ అని చెప్పారు. మొక్కజొన్న, జొన్నలు, పొద్దుతిరుగుడు, వేరుశనగ కొనుగోలు జరగడం లేదన్నారు. ఎస్‌ఎల్‌బీసీలో ప్రమాదం జరిగితే మృతదేహాలను కూడా వెలికి తీయలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది అని విమర్శించారు. రాష్ట్రంలో ఒక్క హామీ ఆయిన అమలు కాలేదు..రాహుల్ గాంధీ మూటలు తీసుకుంటూ మూతి ము సుకున్నారని ఆరోపించారు.

కనపడ్డ దేవుళ్లపై ఒట్టేసి రుణమాఫీ చేస్తా అని చెప్పి దేవుళ్లను కూడా పచ్చి మోసం చేసిన ఘనుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 60 శాతం రుణమాఫీ కాలేదు, రైతు భరోసా సరిగా ఇవ్వలేదు, వడ్లకు బోనస్ ఎగనామం పెట్టారు..పంటల బీమా ఎగ్గొట్టారు.. ఏ ఒక్క మాట కూడా నిలుపు కోలేదు. దీంతో మళ్లొచ్చేది తప్పక కేసీఆర్ ప్రభుత్వమే అన్నారు. అది తెలిసే కాంగ్రెస్ నాయకులు అందిన కాడికి దోచుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

నల్లగొండలో మిల్లర్లకాడ మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వంలో వడ్ల కొనుగోలు విషయంలో రైతులు ఏనాడూ ఇబ్బంది పడలేదన్నారు. రేవంత్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి విమర్శించుకోకుండా రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, భగత్ యాదవ్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్య యాదవ్, మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ జడ్పీ చైర్మన్ బoడ నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.