14 August, 2026 | 12:04 PM

గ్రామపంచాయతీకి 5 హెచ్‌పీ మోటార్‌తో పంట పొలాలకు నీటి వినియోగం

14-08-2026 11:01 AM

బోధన్, ఆగస్టు 14 (విజయక్రాంతి): బోధన్ మండలంలోని బెల్లల్ గ్రామపంచాయతీ(Gram Panchayat) పరిధిలోని కేవీ రెడ్డి నగర్‌లో గ్రామపంచాయతీకి చెందిన 5 హెచ్‌పీ మోటార్‌ను పంట పొలాలకు వినియోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామ ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసిన బోర్‌వాటర్‌ను వ్యవసాయ అవసరాలకు విచ్చలవిడిగా వినియోగిస్తున్నారంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామంలోని కొన్ని ప్రాంతాల్లో మంచినీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని గ్రామస్తులు చెబుతున్న నేపథ్యంలో, కేవీ రెడ్డి నగర్‌లోని బోర్‌వాటర్‌ను పంట పొలాలకు వినియోగించడం పట్ల వారు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ మోటార్‌ను పంట పొలాలకు వినియోగించడం గ్రామపంచాయతీ అధికారుల అనుమతితో జరుగుతుందా? లేక సంబంధిత వ్యక్తులు స్వయంగా వినియోగిస్తున్నారా? అనే విషయం స్పష్టం కావాల్సి ఉంది. అలాగే మోటార్‌ రిపేర్‌కు వస్తే ఖర్చును గ్రామపంచాయతీ భరిస్తుందా? లేక వ్యవసాయానికి వినియోగిస్తున్న వారే భరించాల్సి ఉంటుందా? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

అసలు ఎప్పటి నుంచి ఈ విధంగా మోటార్‌ను వ్యవసాయ అవసరాలకు ఉపయోగిస్తున్నారు? అనే విషయంపై గ్రామపంచాయతీ అధికారులు విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాలని గ్రామస్తులు కోరుతున్నారు. తాగునీటి అవసరాలకు ఇబ్బందులు ఎదురవుతున్న సమయంలో ప్రజల నీటిని వ్యవసాయానికి వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.