గన్నీ బ్యాగుల కోసం ఎగబడ్డ రైతులు
- కుస్తీ పోటీలను తలపించిన మార్కెట్ యార్డ్ ప్రాంతం
- ఒకరినొకరు తోసుకుంటూ లారీ ఎక్కిన తన్నదాతలు
ఆదిలాబాద్, మే 20 (విజయక్రాంతి) : జిల్లాలో గన్ని బ్యాగుల కొలత రైతులను వాటి కోసం ఎగబడేలా చేసింది. మార్కెట్ యార్డ్ కాస్త కుస్తీ పోటీలను తలపించే ప్రాంతంగా మారింది. ఆదిలాబాద్ జిల్లాలోని పలు మార్కెట్ యార్డ్ లో జొన్నల కొనుగోలు ప్రారంభమైనప్పటికీ, సరిపడా గన్ని బ్యాగులు లేని కారణంగా గత వారం పది రోజులుగా కొనుగోలు మందకొడిగా సాగుతున్నాయి. కొనుగోలు ఆలస్యంకు తోడుగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రై తులు ఆందోళన చెందుతున్నారు.
దీంతో పంట రక్షణ కోసం మార్కెట్ యార్డుల్లోనే రైతులు పది రోజులుగా పైగా రాత్రి పగలు అనే తేడా లేకుండా పడి కాపులు కాస్తున్నారు. మార్కెట్ యార్డ్ త రఫున గన్ని బ్యాగులను అందించకపోవడంతో పలువురు రైతులు ప్రైవేట్ గా వాటిని కొనుగోలు చేస్తూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కాగా బుధవారం మార్కెట్ యార్డుకు గన్ని బ్యాగులతో కూడిన లారీ లోడ్ రావడంతో రైతులు ఎగబడ్డారు. లారీ ఆగిన వెంటనే రైతులు పోటీ పడుతూ లారీ పైకి గన్ని బ్యాగుల కోసం కుస్తీ పడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఒక్కసారిగా రైతులందరూ గన్ని బ్యాగుల లారీ వద్దకు తరలి రావడంతో కాసేపు అక్కడ ఆందోళన వాతావరణం కనిపించింది. ఒకరినొకరు తోచుకుంటూ గన్ని బ్యాగుల కోసం పోటీపడి వాటిని దక్కించుకోవడం చూస్తే రైతుల పరిస్థితి దయనీయంగా మారినట్లు కనిపించింది. ఎవరికి ఎన్ని బ్యాగులు దొరుకుతే అన్ని తలపై ఎత్తుకెల్లారు. గన్ని బ్యాగుల లారీ లోడ్ వచ్చినప్పటికీ మార్కెట్ యార్డ్ అధికారులు ఎలాంటి భద్రత చర్యలు చేపట్టకపోవడంతో లారీ వద్ద కాసేపు వాతావరణం నెలకొంది.






