21 May, 2026 | 2:42 AM

ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించాలి

21-05-2026 12:55 AM

నిరుద్యోగ జేఏసీ నాయకురాలు అస్మా డిమాండ్

ముషీరాబాద్, మే 20 (విజయక్రాంతి): గ్రూప్-1, మెగా డీఎస్సీ తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగుల కోసం ప్రభుత్వం నుంచి స్పష్టమైన షెడ్యూల్, ఉద్యోగ క్యాలెండర్‌ను వెంటనే ప్రకటించాలని నిరుద్యోగ జేఏసీ నాయకురాలు అస్మా డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద బుధవారం ఆవేదన సభను నిర్వహించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెబుతూ రెండున్నరేళ్లుగా ఒక్క నోటిఫికేషన్ రాలేదన్నారు. డీఎస్సీ, గురుకుల, మోడల్ స్కూల్, జేఎల్, డీఎల్ అన్ని కలిపి జంబో నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. 

20 వేల పోలీసు ఉద్యోగాలు గ్రూప్స్ నోటిఫికేషన్ జీపీవో, ఎఫ్‌బీవో, పవర్ సెక్టార్ వంటి అన్ని నోటిఫికేషన్లు జూన్ రెండో తేదీ లోపు ప్రకటించకపోతే తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఖాళీల భర్తీ జాబ్ క్యాలెండర్, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ హామీల అమలు కోసం నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ హాజరై సభకు మద్దతు తెలిపారు. నిరుద్యోగ జేఏసీ నాయకులు కిరణ్ రాథోడ్, కయ్య వెంకటేష్, కుమార్ రాథోడ్, హరీష్, ధర్మారపు పవన్ కుమార్, కాశీనాథ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.