8 May, 2026 | 1:57 AM

పీఎం కుసుమ్ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి

08-05-2026 12:50 AM

గంగిపల్లిలో అవగాహన సదస్సు

ఫ్లెక్సీలో ప్రధాని ఫోటో లేదని అభ్యంతరం 

సమావేశాన్ని బహిష్కరించిన బిజెపి నేత

మానకొండూరు, మే 7 (విజయక్రాంతి): వ్యవసాయ యాంత్రీకరణ, సౌర విద్యుత్ పీఎం కుసుమ్ , సూర్య ఘర్ తదితర పథకాలను వివరిస్తూ గంగిపల్లి ధనలక్ష్మి సొసైటీలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఇందులో భాగంగా మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి, విద్యుత్ శాఖ మానకొండూరు ఏఈ సత్యనారాయణ, చెంజర్ల ఏఈ లక్ష్మణమూర్తి మాట్లాడుతూ పి ఎం సూర్యఘర్ మరియు పిఎం కుసుమ్ పథకాలు, వాటి దరఖాస్తు వివరాలు, ప్రయోజనాలు, రైతులకు వివరించారు.

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ రకాల పథకాల పై రైతులకు అవగాహన కల్పించారు. సొసైటీ అధ్యక్షులు పారు పల్లి శ్రీనివాస్ రెడ్డి , రెడ్డి రాజిరెడ్డి , వ్యవసా య అధికారి శ్రీనివాస్ రెడ్డి , గ్రామ ఉపసర్పంచ్ ఎడుమాల సంపత్, సొసైటీ ఉపాధ్యక్షులు పంజాల శ్రీనివాస్, వార్డు సభ్యులు, సొసైటీ డైరెక్టర్లు, రైతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు

పీఎం కుసుం పథకం ఎవరిది..? పీఎం ఫోటో పెట్టరా...?

అధికారుల , ప్రభుత్వ తీరుపై మండిపడ్డ మాజీ ఎంపీటీసీ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రంగు భాస్కరాచారి... 

సమావేశం బహిష్కరణ...

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక రైతు వారము కార్యక్రమంలో భాగంగా గురువారం గంగిపల్లి గ్రామంలో ధన లక్ష్మి ధాన్య విత్తన రైతు పరస్పర సహకార పరిమిత సంఘంలో ఏర్పాటుచేసిన సమావేశంలో స్థానిక మాజీ ఎంపిటిసి, బిజెపి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు రంగు భాస్కరాచారి అధికారుల తీరుపై మండిపడ్డారు.

వ్యవసాయ క్షేత్రాలు., సౌర విద్యుత్ కేంద్రాలు (పీఎం కుసుం పథ కం) అంశంపై సమావేశం చేపట్టినప్పుడు , ఆ పథకాన్ని ప్రవేశపెట్టింది ఎవరు..? ఆ పథకం ద్వారా నిధులు అందిస్తుంది ఎవరు..? అనే విషయంపై అధికారులకు అవగాహన లేదా? అని రంగు భాస్కరాచారి సూటిగా ప్రశ్నించారు.

పూర్తిస్థాయి కేంద్ర ప్రభుత్వ నిధులతో పీఎం కుసుం పథకం అమలవుతుందని, అలాంటప్పుడు కనీసం దేశ ప్రధాని ఫోటో పెట్టక పోవడం అధికారులకు తగదన్నారు. పీఎం కుసుం పథకం ద్వారా పూర్తిస్థాయి కేంద్ర ప్రభుత్వ నిధులతో రైతులకు సోలార్ పంపుసెట్లు సబ్సిడీతో అందిస్తుందని ఆయన తెలిపారు. అలాంటి గొప్ప పథకం అమలు చేయడానికి , విధివిధానాలు తెలియజేయడానికి సమావేశం ఏర్పాటు చేసినప్పుడు , ఆ పథకాన్ని ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం, పీఎం నరేంద్ర మోడీ గురించి చెప్పకపోవడం, ప్రోగ్రాం బ్యానర్లో పీఎం ఫోటో పెట్టకపోవడం భావ్యం కాదన్నారు. అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తులుగా మారారని రంగు భాస్కరాచారి ఘాటు వ్యాఖ్యలు చేసి, అధికారుల తీరుకు నిరసనగా సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు.

ఉన్నతాధికారుల ఆదేశం మేరకే...

పై అధికారుల ఆదేశం మేరకు, వారు పంపిన ఫ్లెక్సీని ఉపయోగించామని, ఇందులో ఎలాంటి వివాదానికి, వివక్షకు ఆస్కారం లేదని విద్యుత్ అధికారులు తెలిపారు.