8 August, 2026 | 11:01 PM

వరి వేసి రైతులు నష్టపోవద్దు

08-08-2026 09:53 PM

జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట,(విజయక్రాంతి): జిల్లాలో వాతావరణం అనుకూలించేలా లేనందున, ఈ ఏడాది వానలు ఆశించిన స్థాయిలో పడకపోవడంతో రైతులు వరి వేసి నష్టపోవద్దని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో తుంగతుర్తి శాసన సభ్యులు మందుల సామేల్, పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లులతో కలిసి ఎల్ నినో ప్రభావంపై అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నాగార్జున సాగర్, ఎస్సారెస్పీ, ప్రాజెక్టులలో సమృద్దిగా నీరు లేనందున నీటి విడుదలపై స్పష్టత లేదన్నారు. జిల్లాలోని 190 పెద్ద చెరువుల్లో చాలా వరకు 25 నుంచి 50 శాతం నీటితోనే ఉన్నాయన్నారు. భూగర్భ జలాలు కూడా రీఛార్జ్ కావడం లేదన్నారు. ప్రస్తుతం వరి నాట్లు వేస్తే అవి కోతకు వచ్చేసరికి నవంబర్, డిసెంబర్ అవుతుందని అప్పుడు వర్షాలు ఉండవని, ప్రాజెక్టుల్లో నీళ్లు అయిపోతే పంట ఎండిపోయి రైతులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. జిల్లాలో ఇంకా 2.35 లక్షల ఎకరాల్లో సాగు ప్రారంభం కావాల్సి ఉందని, ఆ రైతులంతా ఆలోచించుకోవాలన్నారు.

10 రోజుల పాటు పంట మార్పిడిపై స్పెషల్ డ్రైవ్:

పంట మార్పిడిపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు 'రైతులతో మాట - పంట మార్పిడికి బాట' అనే పంట మార్పిడి పథకాన్ని స్పెషల్ డ్రైవ్ గా తీసుకొని  ఈ నెల 10 వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. 10 రోజుల పాటు ప్రతి అధికారి కనీసం 10 మంది రైతులను వ్యక్తిగతంగా కలిసి అవగాహన కల్పిస్తారన్నారు. తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఏఈఓలు, మహిళా సంఘాల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారని, గ్రామ స్థాయిలో రైతు వేదికల ద్వారా ప్రత్యామ్నాయ పంటల లాభాలను వివరిస్తారన్నారు. వరికి బదులు కందులు, పెసర్లు, మినుములు, మొక్కజొన్న వేరుశనగ, ఆయిల్ ఫామ్ వంటి ఆరుతడి పంటలు, కూరగాయలు పండించాలని రైతులకు సూచించారు.

కరువు వచ్చిన అండగా ఉంటాం: తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ 

రాష్ట్రంలో కరువు పరిస్థితులు కనిపిస్తున్నా ప్రజలెవరూ అధైర్యపడొద్దని, ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు వేసుకోవాలన్నారు.  రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ ఈనెల 10వ తేదీన నాగార్జున సాగర్‌లో "వరుణ యాగం" నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

యాదగిరిగుట్ట అర్చకుల ఆధ్వర్యంలో జరిగే ఈ క్రతువులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారన్నారు. అలాగే ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను సజావుగా అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో  అదనపు కలెక్టర్ బి.హరి సింగ్, ఇరిగేషన్ సి ఇ నాగభూషణం, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, గడ్డిపల్లి కె.వి.కె ప్రోగ్రాం కోఆర్డినేటర్ దొంగరి నరేష్ తదితరులు పాల్గొన్నారు.