8 August, 2026 | 10:55 PM

రూ. 98 కోట్లతో గూడెం సత్యనారాయణ దేవస్థానం నిర్మాణం

08-08-2026 09:48 PM

- పుష్కరాల నాటికి ఎకో టూరిజం, బోటింగ్, యానిమల్ సఫారీకి ప్రణాళికలు

- అభివృద్ధిని చూడలేక అసత్య ప్రచారాలు

- రూ. 450 కోట్ల అప్పు ఆరోపణలు అవాస్తవం

- ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

మంచిర్యాల,(విజయక్రాంతి): దండేపల్లి మండలంలోని గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థాన అభివృద్ధికి రూ. 98 కోట్లతో నిర్మాణ పనులు, మంచిర్యాలలో రూ. 4.94 కోట్లతో విశ్వనాథ ఆలయ అభివృద్ధి చేపడుతున్నామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్ రావు తెలిపారు. శనివారం మంచిర్యాల పట్టణంలో ఒక హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయాల అభివృద్ధి, ఆలయల పునఃనిర్మాణ పనులకు సంబంధించి పీపీటీ ప్రజంటేషన్, నమూన ప్లానింగ్ వీడియోలను LED స్క్రీన్ ద్వారా చూపించిన అనంతరం ఆయన మాట్లాడారు.

వచ్చే గోదావరి పుష్కరాల నాటికి గూడెం దేవస్థానం నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు ఎల్లంపల్లి నుంచి గూడెం గోదావరి వరకు ఎకో టూరిజం, బోటింగ్, యానిమల్ సఫారీ కేంద్రాలను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం అభివృద్ధి పనులు, పుష్కర ఘాట్ల నిర్మాణం కోసం టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి శ్రావణమాసంలోగా అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని తెలిపారు. పుష్కరాల నాటికి గూడెం అభివృద్ధి పనులు, పుష్కర ఘాట్లు పూర్తవుతాయని తెలిపారు.

గుట్టపై భక్తులకు అన్ని రకాల వసతి సౌకర్యాలు, ఒకే సారి పది వేల మంది భక్తులు దర్శించుకునేలా ఏర్పాట్లు, ఒకే సారి వెయ్యి జంటలు సత్యనారాయణ వ్రతాలు ఆచరించుకునేలా, భక్తుల కోసం ప్రత్యేక గదులు అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు. పుష్కర ఘాట్ల వద్ద బోటింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ ఆలయం పునర్నిర్మాణ పనులు కూడా ప్రారంభించి త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు.

రూ. 450 కోట్ల అప్పు ఆరోపణలు అవాస్తవం

తనపై రూ. 450 కోట్ల అప్పు తీసుకుని అవినీతికి పాల్పడ్డారంటూ బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని ఎమ్మెల్యే పీఎస్ఆర్ ఖండించారు. వివిధ బ్యాంకుల నుంచి రూ. 109.11 కోట్లు మాత్రమే అప్పుగా తీసుకున్నానని, దాని అసలు, వడ్డీ కలిపి రూ. 195 కోట్లు బ్యాంకులకు చెల్లించానని తెలిపారు. తనపై ఒక అబద్ధాన్ని పదేపదే ప్రచారం చేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

తన నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష నాయకులు అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తనకు లభిస్తున్న ప్రజాదరణను చూసి ప్రతిపక్ష నాయకులకు నిద్ర పట్టడం లేదని, కాకి లెక్కలు చెబుతూ రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న వ్యక్తులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.

యుద్ధప్రాతిపదికన తాగునీటి పైప్‌లైన్ పనులు

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాళ్లవాగు వద్ద మంచినీటి పైప్‌లైన్లు దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే ప్రేం సాగర్ రావు తెలిపారు. వాగు ఉధృతంగా ప్రవహించడంతో వేగంగా మరమ్మతులు చేపట్టలేకపోతున్నామని, ప్రస్తుతం యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఆదివారం సాయంత్రంలోగా మంచిర్యాల పట్టణ ప్రజలకు తాగునీటిని అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఈ విలేకరుల సమావేశంలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, లక్షెట్టిపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, లక్షెట్టిపేట మండల అధ్యక్షులు, సర్పంచ్ నలిమెల రాజు, లక్షెట్టిపేట పట్టణ అధ్యక్షులు సయ్యద్ షాహిద్ అలీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, మంచిర్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ మంగిలాల్ సోమానీ, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.