అకాల వర్షాలతో రైతులు అప్రమత్తంగా ఉండాలి
వర్షంలో తడవకుండా జాగ్రత్తలు పాటించాలి
సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ
సూర్యాపేట, మే 4 (విజయక్రాంతి): అకాల వర్షాలలో రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ అన్నారు. సూర్యాపేట రూరల్ పరిధి టేకుమట్ల గ్రామంలో వరి ధాన్యం ఆరబోసిన రైతులతో సోమవారం ఆయన మాట్లాడారు. వేసవికాలం ఎండల తీవ్రతతో పాటు ఉరుములు మెరుపులు, గాలి దుమారంతో అకాలంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ధాన్యం ఆరబోసిన రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం వర్షంలో తడవకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
పట్టాలు, టార్ఫాలిన్ లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వర్షంలో తడిసి ధాన్యం నాణ్యత తగ్గక ముందే ధాన్యాన్ని సకాలంలో మార్కెట్లకు, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించుకుని ప్రభుత్వం అందించే ధరను పొందాలన్నారు. ధాన్యంను రోడ్లపై అరబోయడం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలున్నాయన్నారు.. నాణ్యమైన పంట దిగుబడి కోసం మంచి విత్తన రకాలను ఎంపిక చేసుకోవాలన్నారు.
వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలతో ఆధునిక వ్యవసాయం చేస్తూ ఎక్కువ దిగుబడి పొందాలని సూచించారు. నమ్మకమైన డీలర్లు లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవసాయ కేంద్రాల నుండి మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. ప్రభుత్వం గుర్తింపు పొంది, కంపెనీ లేబుల్ ఉన్న విత్తనాలనే కొనుగోలు చేయాలన్నారు. నకిలీ విత్తనాలకు సంబంధించిన సమాచారం స్థానిక పోలీసులకు, డయల్ 100 కు, సూర్యాపేట జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712686057 కు సమాచారం ఇవ్వలన్నారు. ఇల వెంట పలువురు సిబ్బంది, రైతు లో ఉన్నారు.






