నకిలీ మందులతో రైతులు కుదేలు
ఫెర్టిలైజర్ డీలర్లు.. కంపెనీ డీలర్లతో.. సెటిల్మెంట్లు
ప్రతి సంవత్సరం వందల ఎకరాల్లో రైతుల పంట నష్టం
జిల్లాలను దాటుతున్న యూరియా అమ్మకాలు
తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులకు మేలైన విత్తనాలు ఒక ప్రక్క, మరొక ప్రక్క నాణ్యమైన ఫెర్టిలైజర్స్ అందించాలని సంకల్పంతో ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ అధికారులు మండలాల్లోని గ్రామాల్లో పర్యటించి తనిఖీలు జరుగుతున్నప్పటికీ నకిలీ మందులతో రైతులు అపార నష్టం చవిచూస్తున్నారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో గత సంవత్సరం వెలుగు పల్లి గ్రామంలో రైతులు పంట నష్టం చూసినప్పటికీ, ఎవరికి చెప్పుకోలేక వారికి వారే, నష్టాన్ని చూశారు. ప్రస్తుతం మండల పరిధిలో గ్రామంలో ఓరైతే ఏకంగా 10 ఎకరాలకు పైగా వరి విత్తినారు. నెల రోజులు గడవదా, తుంగతుర్తి పట్టణ కేంద్రంలోని ఓ పెటిలైజర్ షాప్ నుండి, వరి పైరు దిగుబడి, కలుపు నివారణ కోసం మందు తీసుకొని వచ్చి పిచికారి చేయగా, ఏకంగా పైరు మొత్తం ఎర్రగా, కుళ్లిపోయినట్లుగా మారింది.
ఇదేమిటని లబోదిబోమనగా, కంపెనీ డీలర్లే వచ్చి పర్యవేక్షణ చేసినట్లు సమాచారం. పట్టణ కేంద్రాల్లోని షాపు వారు యూరియా అమ్మకాలు జిల్లాలను దాటి అమ్ముతున్నట్లు వాపోతున్నారు. స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శలు జోరుగా వస్తున్నాయి. జరిగిన సంఘటనపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి, నకిలీ మందులు అమ్ముతున్న ఫెర్టిలైజర్ షాపుపై శాఖ పరమ చర్యలు తీసుకోవాలని, రైతులు మేధావులు కోరుతున్నారు.






