కాంగ్రెస్ పార్టీతోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యం
మున్సిపాలిటీ మూడవ వార్డులో ఎన్నికల ప్రచారం
నకరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మున్సిపాలిటీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, 12 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శనివారం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో మూడో వార్డులో ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ప్రతి వార్డుకు సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ, లైటింగ్, త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాలను కల్పించేందుకు మూడు కోట్ల నిధులతో పనులు ప్రారంభించనున్నామని తెలిపారు.
త్వరలోనే మున్సిపాలిటీకి 300 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయనున్నట్టు తెలిపారు. పట్టణంలో సొంత ఇల్లు లేని పేదవారు లేకుండా చూస్తానని అన్నారు. రాష్ట్రంలో ప్రజా పాలన ప్రభుత్వం ఉన్నందున అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయని అన్నారు. అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతాయని, ప్రజలు అధికార పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని అన్నారు.






