28 May, 2026 | 1:56 AM

ధాన్యం కొనాలంటూ రోడ్డెక్కిన రైతన్నలు

28-05-2026 12:00 AM
  1. గంటపాటు నిలిచిన రాకపోకలు
  2. పోలీసులు నచ్చజెప్పడంతో శాంతించిన రైతులు

తాండూరు, మే 27 (విజయక్రాంతి): వరి ధాన్యం కొనుగోలు చేయాలని సకాలంలో లారీలు ఏర్పాటు చేసేందుకు అధికారులు ముందుకు రావాలని బుధవారం వికారాబా ద్ జిల్లా పెద్దెముల్ మండలం, మంబాపూర్ వద్ద తాండూర్, హైదరాబాద్ రహదారిపై రైతన్నలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే కొనుగోలు చేసేందుకు అధికారులు రైతులకు నానా ఇబ్బందులు పెడుతున్నారని ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు.

కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని రవాణా చేసేందుకు సరిపడా లారీలు కూడా ఏర్పాటు చేయడం లేదని.... వర్షం కురిస్తే ధాన్యం తడిసి నష్టం జరిగే అవకాశం ఉందని వెంటనే అధికారులు, పాలకులు కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో గంటకు పైగా హై దరాబాద్, తాండూర్ వెళ్లేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ప్రశాంత్ వర్ధన్ ఘటనా స్థలానికి చేరుకొని అధికారులతో మాట్లాడి ధాన్యాన్ని కొనుగోలు చేసి లారీలు సైతం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పడంతో రైతన్నలు శాంతించారు.