2 May, 2026 | 1:02 AM

కాంటా పెట్టరు.. ధాన్యం తరలదు..

02-05-2026 12:00 AM

ధాన్యం రాశులతో రైతుల ఎదురుచూపులు 

స్పందించని అధికారులు 

ఆందోళన చెందుతున్న అన్నదాతలు

కామారెడ్డి, మే 1 (విజయక్రాంతి): ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ప్రజా ప్రతినిధులు అధికారులు ఒకవైపు గొప్పలు చెప్తున్నా, కామారెడ్డి జిల్లాలో క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. రైతులు గత 20 రోజులుగా ధాన్యం రాశుల వెంట ఉండి ధాన్యం కాంటా కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.

కామారెడ్డి డివి జన్ లోని రామారెడ్డి, సదాశివ నగర్, పల్వంచ, మాచారెడ్డి, దోమకొండ, బిబిపేట, బిక్కనూర్, తాడువాయి, రాజంపేట, లింగంపేట్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, గాంధారి, తదితర మండలాల్లోని ఆయా గ్రామాల్లో రైతులు ధాన్యం రాశులతో ఎదురుచూస్తున్నారు. అధికారులు మాత్రం రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తున్నారు. మరోవైపు ఎండలు, అకాల వర్షాలు కురిస్తే తమ బతుకు అదో గతి అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం దాన్యం రాశుల వైపు కన్నెత్తి చూడడం లేదు. రైతులు మాత్రం ప్రతిరోజు ఎండబెట్టడం కుప్పలు చేయడం వంటి పనులు చేస్తూ కుప్పల వద్ద కాపు కాస్తు నిరీక్షిస్తున్నారు.

రైతుల అవస్థలను అధికారులు, ప్రజాప్రతి నిధులు పట్టించుకోవడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. అకాల వర్షం పడితే తమ బతుకులు  ఆగమవుతాయని, ఆరుగాలం కష్టపడి, పెట్టుబడులు పెట్టి పండించిన ధాన్యం అమ్ముకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. దళారులకు ధాన్యం అమ్మ వద్దు ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం  ఆమ్మీ గిట్టుబాటు ధర పొందాలని అధికారులు సూచిస్తున్న, ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

15 రోజులుగా వడ్లు కల్లాలలో పెట్టి ఎండబెట్టి కాంటా కోసం ఎదురు చూస్తున్నామని కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం మంథని దేవునిపల్లి కి చెందిన రైతులు విజయ క్రాంతి ప్రతినిధితో తమ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు రోజు చెప్పిన వస్తామంటూ రావడంలేదని ధాన్యం కాంటా పెట్టడం లేదని ధాన్యం ఎండబెడుతు కుప్పలు చేస్తూ ఉన్నామని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కల్లాలలో ఆరబోసిన ధాన్యం వెంటనే తూకం వేసి తరలించాలని రైతులు కోరుతున్నారు. రైతులకు సరిపడ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను రైతులు వేడుకుంటున్నారు.

గన్ని సంచుల ఇబ్బంది ఉందంటూ అధికారులు తప్పించుకుంటున్నారని, రైతులు తెలిపారు. లారీల సమస్య ఉందని ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు అవుతాయనే ఉద్దేశంతోనే ధాన్యం కాంటా చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కామారెడ్డి డివిజన్లో ని రైతులు ధాన్యాన్ని కుప్పలుగా పోసి అధికారుల కోసం ఎదురు చూస్తున్నారు. అకాల వర్షం సంభవిస్తే చేతికి వచ్చిన పంట తడిసి నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధి అధికారులు వెంటనే స్పందించి కల్లాలలో ఉన్న ధాన్యం రాశులను వెంటనే కాంటా చేసి తరలించాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే.