5 May, 2026 | 1:26 AM

ఘనంగా రైతు వారోత్సవం

05-05-2026 12:00 AM

హాజీపూర్, మే 4 : హాజీపూర్ మండలంలోని కర్ణమామిడి, గుడిపేట, ముల్కల్ల రైతు వేదికల్లో సోమ వారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వారోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. మంచిర్యాల ఏడీఏ మామిడి క్రిష్ణ ముఖ్య అతిథిగా హాజరై రైతులనుద్దేశించి మాట్లాడుతూ శాస్త్రీయ పద్ధతుల్లో సాగు విధానాలపై అవగాహన కల్పించారు. రైతులు తమ భూముల్లో ప్రతి రెండు, మూడేండ్లకు ఒకసారి నేల పరీక్షలు చేయించుకొని, సాయిల్ హెల్త్ కార్డ్ ఆధారంగా పంటలకు అవసరమైన పోషకాలను సమతులంగా అందించాలని, పచ్చి రొట్ట ఎరువుల వినియోగం, పంట అవశేషాల నిర్వహణ, నేలలో జీవ పదార్థాల పెంపు, సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యతను వివరించారు.

అలాగే అధికంగా రసాయన ఎరువులు వాడకల కలిగే నష్టాలను, సూక్ష్మ పోషకాల ప్రాముఖ్యతపై రైతులకు అవగాహన కల్పించారు. మంచి దిగుబడికి నాణ్యమైన విత్తనాల ఎంపిక అత్యంత కీలకమని, సర్టిఫైడ్ విత్తనాలు మాత్రమే కొనుగోలు చేయాలని, నకిలీ విత్తనాల నుంచి అప్రమత్తంగా ఉండాలని, విత్తనాలు కొనుగోలు సమయంలో బిల్ తీసుకోవడం తప్పనిసరి అని సూచించారు. ప్రభుత్వం సిఫారసు చేసిన సన్న రకం వరి రకాలను (బీపీ 5204, తెలంగాణ సోనా, ఆర్‌ఎన్‌ఆర్ 15048, కేఎన్‌ఎం 1638, జై శ్రీరామ్, హెచ్‌ఎంటీ, డబ్ల్యూజీఎల్ 962, డబ్ల్యూజీఎల్ 44, జేజీఎల్ 1798 సాగు చేయాలని, దొడ్డు రకాలను సాగు చేయవద్దని సూచించారు.

యూరియా బుకింగ్ యాప్ పై, నానో యూరియా వినియోగం గురించి, పంట మార్పిడి లో భాగంగా ఆయిల్ పామ్, పప్పు దినుసులు, కేసురైన పబ్బ చెట్ల పంపకం, కూరగాయలు, అంతర పంటలు సాగు కలిగే అదనపు లాభాల గురించి వివరించారు. అనంతరం రైతులకు భూసార కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు బొడ్డు భూమన్న(కర్ణమామిడి), దొండ యేసయ్యా (పడ్తనపల్లి), మాజీ జడ్పీటీసీ, ఎఫ్పీఓ ఛైర్మెన్ పుస్కూరి శ్రీనివాస రావు, ఆత్మ డైరెక్టర్ తనుగుల రవి గౌడ్, వెటర్నరీ డాక్టర్ హారిక, మండల వ్యవసాయాధికారి క్రిష్ణ, ఏఈఓలు కొమురయ్య, మౌనిక, రైతులు తదితరులు పాల్గొన్నారు.