calender_icon.png 11 May, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి ఓసీలో ఘోర ప్రమాదం

18-07-2024 12:58:48 AM

కూలిన వాల్ సంపు సైడ్ వాల్ 

అక్కడికక్కడే ఇద్దరు కార్మికుల దుర్మరణం

భద్రతపై డైరెక్టర్ పర్యటించిన రోజునే ఘటన

వర్షం కురిసినా పనులు చేయడంతోనే ప్రమాదం

కార్మిక సంఘాల నాయకుల ఆరోపణ.. ఆందోళన

సంతాపం తెలిపిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

మంథని, జూలై 17 (విజయక్రాంతి): సింగరేణి రామగుండం- 3 డివిజన్ పరిధిలోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ -2 లో బుధవారం రెండో షిఫ్ట్ లో ఘోర ప్రమాదం సంభవించింది. హైవాల్ సంపు దగ్గర పనులు జరుగుతుండగా సైడ్ వాల్ కూలి ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సింగరేణి సంస్థ డైరెక్టర్ (పీపీ) జీ వెంకటేశ్వర్‌రెడ్డి బుధవారం ఇదే డివిజన్లో పర్యటించి, భద్రతపై అధికారులకు సూచనలు చేసిన గంటల్లోనే  ప్రమాదం జరగడం గమనార్హం.

ఓపెన్ కాస్ట్-2 ప్రాజెక్టులోని క్వారీలోని హైవాల్ సంపు దగ్గర పనులు జరుగుతున్నాయి. సంపు సమీపంలోని సైడ్ వాల్ కూలడంతో విధుల్లో ఉన్న కార్మికులు ఉప్పు వెంకటేశ్వర్లు, విద్యాసాగర్  అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. కార్మికుల మృతదేహాలను గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా దవాఖానకు తరలించారు. గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నా.. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో పనులు చేయించడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఇద్దరు కార్మికులు మృతి చెందారని కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులైన అధికారు లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రామగుండం సింగరేణి దవాఖానలో క్షతగాత్రులను టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి తదితరులు పరామర్శించారు.

కార్మికుల మృతి బాధాకరం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 

హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): రామగుండం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు 2 గనిలో పైప్‌లైన్ మరమ్మతులు చేస్తుండగా మట్టిపెల్లలు విరిగిపడి ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన విచారకరమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. వర్షాకాలం గనుల్లో నిలిచిపోయే నీటిని తోడేసేందుకు అవసరమైన పంపులు, పైప్‌లైన్ల మరమ్మతుల సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిసిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.