మరమరాల మర్మం!
ఎవరికైనా, దేనికైనా ఓ రోజంటూ తప్పకుండా వస్తుంది. భారత సర్వోన్నత న్యాయాధిపతి నోట జాలువారిన బొద్దింకలకూ ఓ రోజు వచ్చింది. వంటిళ్లలో, మంచాల కిందా, అక్కడా ఇక్కడా పాకుతూ ముఖ్యంగా రాత్రుళ్లూ స్వేచ్ఛగా తిరుగాడే మన మాండలికం, యాసలో జెల్ల పురుగుల పేరిట ఓ ఉద్యమమే మన దేశంలో జోరుగా మొదలైంది. అలాగే మన ఇళ్లలో చిరుతిళ్లకే కాదు.. ప్రధానంగా బీద, మధ్యతరగతి కుటుంబాలు ఓ పూట సరిపెట్టు కునే మరమరాలకూ ఒక శుభ దినమొచ్చింది.
మనం నోటి నిండా అత్యంత ప్యార్‌తో ప్యాలాలుగా పిలుచుకునే ఝాల్ మురీలకూ ఒక రోజేమిటీ? రోజుల మీద రోజులు వస్తూనే ఉన్నాయి. నిజానికి బొద్దింకలను చూస్తే ఎందరో అసహ్యించుకుంటారు. అలాగే ఇంకెందరో ప్యాలాలనూ లైట్ తీసుకుంటారు. కానీ, ఆ రెండింటిదే ఇప్పుడు యావత్ దేశంలో ట్రెండింగ్. ఇందుకు మన దేశంలోని ప్రముఖులే ప్రధాన కారణం!
పశ్చిమ బంగాల్ రాష్ట్రాన్ని ఏలాలన్నది భారతీయ జనతా పార్టీ చిరకాల స్వప్నం. ఆ కల నెరవేర్చుకోడానికి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే ఢిల్లీ నుంచి బంగాల్‌కు లోకల్ ట్రిప్స్ మాదిరిగా కడపటి ఎన్నికల్లో రాకపోకలు చేశారు. ఆ క్రమంలోనే దారెంట ఓ అతి సాధారణ దుకాణంలో ఝాల్ మురీ పొట్లం కొనుక్కుని తింటూనే చుట్టూ చేరిన వారికి పంచి పెట్టారు. బంగాల్‌లో ఈ చిరుతిండిని ఇష్టంగా తింటారు.
ఆ మాటకొస్తే మన లోగిళ్లలోనూ పోపు వేసి, కారం నూనె కలుపుకొని లేదా చాయ్‌లో నాన్చుకొని మనమూ ఆహారంగా తీసుకుంటాం. అయితే, పశ్చిమ బంగాల్‌లో చోటుచేసుకున్న ఆ సన్నివేశం ఆ రాష్ట్ర ఓటర్లనూ బాగా ఆకట్టుకుంది. ప్రధానమంత్రి ఈవెంట్ల సూక్ష్మదర్శిని ఎంత ప్రభావమంతమో రుజువైంది.
దాల్ ముడి అంటే పేలాల చుడువాను తాను ఒక కామన్ మ్యాన్‌గా అరచేతిలో వేసుకొని నమలడమే కాదు, అత్యంత పటిష్టమైన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీని కూడా రాజకీయంగా నమిలేశారు. ఎంతలా అంటే, ఆ రాష్ట్రంలో అధికారాన్ని కైవశం చేసుకోవడమే కాదు.. నిక్షేపమైన టీఎంసీ ఉనికినే ప్రశ్నార్థకం చేసేశారు. ఇంతటి నేపథ్యంలో గాలిలో ఎగిరిపోయే తేలికైన పేలాల చుడువా అంత బలమైన శక్తికి సూచకమే అయింది.
తెలంగాణలోనూ రుచి చూపిస్తారా?
ఇక ఝాల్ మురీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అధికారిక చిరుతిండి అవుతోంది. మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఎక్కువ కాలం వరుసగా 4,338 రోజులు పరిపాలించిన జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును నరేంద్ర మోదీ 4,339 రోజులుగా ఏలుతున్న ప్రధానిగా ఈ జూన్ 10తో అధిగమించారు. ఆ అపూర్వ సందర్భంలో అత్యున్నత ఎన్డీయే కూటమి మీటింగ్‌లోనూ ఝాల్ మురీనే ఆకర్షణగా మారింది.
పోపు వేసిన ఆ మరమరాలను చిన్నపాటి పాత్రలో అదే పశ్చిమ బంగాల్ బీజేపీ తొలి ముఖ్యమంత్రి సువేందు అధికారి మోదీకి ఇవ్వగా, తాను రుచి చూస్తూనే సహచరులకూ పంచారు ప్రధాని. పేలాలు కడుపు నింపకపోవచ్చు కానీ, తిన్నామనే తృప్తినిస్తాయి. ప్రధానమంత్రి పొదుపు సూత్రాల్లో నేరుగా భాగం కాకపోయినా ఎల్పీజీ వాడకంలోనూ పొదుపు అవసరాన్ని ధరలూ, పశ్చిమాసియా స్థితిగతులు నొక్కి చెబుతున్నాయి.
అంటే, పొయ్యితో పని లేకుండానూ పేలాలను నూనె, కారంలో కలుపుకొని కమ్మగా భుజించి బ్రేక్ ఫాస్ట్ మాదిరిగా కానీయొచ్చు. మరమరాలు తేలికైన ఆహారం. కేలరీలు తక్కువే. విటమిన్ బీ, డీ, ఐరన్, క్యాల్షియం పోషకాలు సహా ఫైబర్ కూడా అందులో ఉంటుంది. సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదే పదే ప్రచారం చేస్తున్న పేలాలను మన రాష్ట్రంలోనూ కమలనాథులు మోదీ మనసెరిగి తమ రోజూవారీ కార్యాచరణలో భాగం చేయొచ్చు.
వ్యాసకర్త: ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, 9440850384






