అటకెక్కిన ఫీజు నియంత్రణ!
- ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేస్తామన్న సర్కారు హామీ అమలేదీ?
- జూన్ 12 నుంచి కొత్త విద్యాసంవత్సరం
- 20 నుంచి 30 శాతం ఫీజులను పెంచుకుంటున్న పాఠశాలలు
- ఇంజినీరింగ్ వార్షిక ట్యూషన్ ఫీజు కంటే స్కూల్ ఫీజే అత్యధికం
హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): మధ్యతరగతి కుటుంబాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్న ఫీజుల నియంత్రణ చట్టం అటకెక్కినట్టుగా కనిపిస్తున్నది. ప్రభుత్వం దీనిపై ఏమాత్రం ఉలుకు పలుకు లేకుండా నిమ్మకునీరెత్తినట్టు కనిపిస్తున్నది. దీంతో ఈ విద్యాసంవత్సరం కూడా తల్లిదండ్రుల జేబులకు చిల్లు తప్పదనిపిస్తున్నది. పలు కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేస్తామన్న ప్రభుత్వ హామీ ఈ ఏడాది కూడా అమలుకు నోచుకునేలా కనిపించడంలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నది. దీన్ని ఇప్పటి వరకు అమలు చేయని పరిస్థితి ఉంది. జూన్ 12 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కూడా కాబోతోంది. ఫీజులను నియంత్రిస్తామన్న ప్రకటన ప్రభుత్వం నుంచి రాకపోవడంతో తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులను పెంచకుండా నియంత్రించే చర్యలు ప్రతి ఏటా మాటలకే పరిమితమవుతున్నాయి.
దీంతో విద్యాసంవత్సరం ప్రారంభమవుతోందంటే తల్లిదండ్రుల జేబులు అదురుతున్నాయి. ని యంత్రణకు చట్టం తెచ్చేందుకు బిల్లు సిద్ధమై ఏడాదవుతున్నా ఈసారి కూడా అది చట్టరూపం దాల్చలేదు. ఇదే అదునుగా ప్రైవేట్ పాఠశాలలు తమ ఇష్టారాజ్యంగా 20 --30 శాతం వరకు ఫీజులను పెంచేసుకుంటున్నాయి.
స్కూల్ ఫీజే ఎక్కువ
ప్రైవేట్ పాఠశాలలు 2026-27 విద్యాసంవత్సరానికి ఫీజులు ఖరారు చేసి ఏకంగా అడ్మిషన్లు కూడా చేపడుతున్నారు. ఒకవైపు పుస్తకాలు, యూనిఫామ్స్ మోత.. మరోవైపు ఫీజుల వాత అన్నట్టుగా తల్లిదండ్రుల పరిస్థితి ఉన్నది. చెప్పాలంటే ఇంజినీరింగ్ వార్షి క ట్యూషన్ ఫీజు కంటే కూడా స్కూల్ ఫీజు లు ఎక్కువగా ఉన్న పాఠశాలలూ ఉన్నాయి. ఈ తరహా ఫీజులున్న పాఠశాలలు ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి.
రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యకు అత్యధిక వార్షిక ట్యూషన్ ఫీజు రూ.1.83 లక్షలు, ఆతర్వాత రూ.1.75 లక్షలు కాగా, కనీస ఫీజు రూ.45 వేలే ఉన్నది. అదే పాఠశాలల విషయానికి వస్తే రూ.5 లక్షలకుపైగా వసూ లు చేసే స్కూళ్లు దాదాపు 10కిపైనే ఉన్నాయి. తమ వద్దే పుస్తకాలు, నోట్ బుక్స్, టై, బెల్టు, షూస్, యూనిఫామ్స్ కొనుగోలు చే యిస్తూ వాటిపైనా బాదుతున్నారు.
మార్గదర్శకాలు సిద్ధమే..
ఫీజుల నియంత్రణకు సంబంధించిన డ్రాఫ్ట్ ఎప్పుడో సిద్ధమైంది. పాఠశాల విద్యాశాఖ డ్రాఫ్ట్ రూపొందించి గతంలో ప్రభుత్వానికి కూడా సమర్పించింది. తెలంగాణ విద్యాకమిషన్ కూడా తెలంగాణ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ స్కూల్ రెగ్యులేటరీ అండ్ మా నిటరింగ్ కమిషన్ ముసాయిదా బిల్- 2025ను గతేడాది జనవరిలో ప్రభుత్వానికి రిపోర్టును అందించింది. రెండు నెలల క్రితం తెలంగాణ విద్యావిధానం--2026 పేరుతో కమిషన్ నివేదిక కూడా ఇచ్చింది.
ఈ నివేదికల ప్రకారం ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు ప్రతి రెండేండ్లకోసారి 8 శాతం వరకు ఫీజులు పెంచుకోవచ్చని వెసులుబాటు కల్పించాలని ప్రతిపాదించారు. ఒకవేళ 8 శాతం ఫీజు మించితే జిల్లాస్థాయి ఫీజు రెగ్యులేటరీ కమిటీ అనుమతి తీసుకోవాల్సి ఉం టుంది. స్కూళ్లను బట్టి కూడా ఫీజులుండాలనే ప్రతిపాదన ఉన్న ది. క్యాబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి అసెంబ్లీ సమావేశాల్లో చట్టం చేస్తారని అంతా అ నుకున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు.
గతంలో ఎన్నోసార్లు ఇలా ఫీజుల అంశంపై కమిషన్/కమిటీలు ప్రభుత్వానికి నివేదికలను సమర్పించాయి. ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ కూడా దీనిపై 2017లో ప్రభు త్వానికి నివేదిక ఇచ్చింది. అందులోనూ ఏటా 10 శాతానికి ఫీజులు మించ కూడదని స్పష్టంచేశారు. కానీ అదీ కూడా అటకెక్కింది. పుష్కర కాలంగా ప్రభుత్వాలు, కమిటీలు నివేదికలకే పరిమితమవుతుంటే.. పాఠశాలలు మాత్రం తమ పని తాము చేసుకుంటామన్నట్టు ఏటా ఫీజులు పెంచుతున్నాయి.






