15 April, 2026 | 4:21 PM

ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి

14-04-2026 01:08 AM

ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

బడంగ్పేట్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయడంలో జరుగుతున్న జాప్యం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం బడంగ్పేట్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవం, ఫేర్వెల్ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవ డంతో సుమారు 13 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఒత్తిడికి లోనవుతున్నారని తెలిపారు. రాజకీయా లను పక్కన పెట్టి, విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే నిధులను విడుదల చేసి విద్యార్థులపై భారం తగ్గించాలని డిమాండ్ చేశారు.

పీజీ, ఇంజనీరింగ్, ఐటీఐ కళాశాలల ఏర్పాటుకు కృషి చేస్తానని, ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వానికి లేఖలు రాసినట్లు వెల్లడించారు. 90 శాతం ఫలితాలు సాధించిన బడంగ్పేట్ కాలేజీ విద్యార్థులను ఆమె అభినందించారు. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తల్లిదండ్రుల కష్టాన్ని గౌరవించాలని కోరారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్ మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ సిహెచ్. ప్రసాద్, స్థానిక నాయకులు పెద్దబాయి ఆనంద్ రెడ్డి, కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు.