19 August, 2026 | 6:59 PM

ఫోటో జర్నలిస్టులకు ఘన సన్మానం

19-08-2026 06:22 PM

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ పత్రికల్లో పనిచేస్తున్న సీనియర్ ఫోటో జర్నలిస్టులు పాలకుర్తి మధు, బండ మోహన్, తోట శ్రీనివాస్‌లను జర్నలిస్ట్ మిత్రులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ టీయుడబ్ల్యూజె ఐజేయు జిల్లా అధ్యక్షులు క్యాతం సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్లు సమాజానికి కళ్లలాంటి వారని, ఒక ఫొటో వెయ్యి పదాలకంటే ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించే చిహ్నంగా ఫొటో నిలుస్తుందని అన్నారు.

ప్రజల సమస్యలు, సంఘటనలను కెమెరాలో బంధించి చరిత్రగా నిలిపే ఫోటోగ్రాఫర్ల సేవలు అభినందనీయమని కొనియాడారు. ఏండ, వాన, పగలు, రాత్రి అనేది లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తూ వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువస్తున్న ఫోటోగ్రాఫర్లను సమాజం గుర్తించి గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్లు అందరికి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు శ్యామల శ్రీనివాస్, భూమిరెడ్డి, శేఖర్ నాని, సాంబయ్య, ప్రవీణ్, పవన్, దేవేందర్, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.