సైబర్ నేరాలు, సోషల్ మీడియా, మహిళల భద్రతపై షీ టీం అవగాహన
భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు భూపాలపల్లి షీ టీం ఎస్సై స్వప్న కుమారి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సంఘమిత్ర డిగ్రీ, పీజీ కళాశాలలో సైబర్ నేరాలు, సామాజిక మాధ్యమాల వినియోగం, మహిళల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీం ఎస్‌ఐ స్వప్న కుమారి, సిబ్బంది విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, వీడియో కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు, పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ వివరాలు, ఓటీపీలను ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళల పట్ల ఎవరైనా అసభ్యంగా లేదా అనుచితంగా ప్రవర్తించినా, వేధింపులకు పాల్పడినా ధైర్యంగా షీ టీంకు సమాచారం అందించాలని సూచించారు. షీ టీం మొబైల్ నంబర్ 8712658162కు ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 112 సేవలను వినియోగించుకోవాలని సూచించారు.






