బదిలీపై వెళ్తున్న విద్యుత్ సిబ్బందికి ఘన సన్మానం
గణపురం,(విజయక్రాంతి): విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తూ తమ కర్తవ్య నిష్ఠ, నిజాయితీ, సేవాభావంతో వినియోగదారుల ప్రశంసలు పొందిన జూనియర్ లైన్‌మన్ బుర్రగడ్డ మధుకర్ గౌడ్, అసిస్టెంట్ లైన్‌మన్ రత్నాకర్ లు బదిలీపై మరో ప్రాంతానికి వెళ్తున్న సందర్భంగా స్థానిక సబ్ స్టేషన్ లో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు ఇరువురిని శాలువాతో సత్కరించి అభినందించారు. ఉద్యోగ బాధ్యతల పట్ల అంకితభావంతో పనిచేస్తూ విద్యుత్ అంతరాయాలను త్వరితగతిన పరిష్కరించడం, వర్షం, ఎండ, రాత్రి అనే తేడా లేకుండా గణపురం, చెల్పూర్ ప్రాంతాల ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు కృషి చేయడం వారి సేవలకు నిదర్శనమని కొనియాడారు.
సహోద్యోగులతో స్నేహపూర్వకంగా మెలుగుతూ, ప్రజలతో మర్యాదగా వ్యవహరించి శాఖకు మంచి పేరు తీసుకొచ్చారని తెలిపారు. బదిలీపై వెళ్తున్నచోట ఇదే సేవాస్ఫూర్తితో పనిచేసి మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాఖ అధికారులు, సిబ్బంది కలిసి వీరిని శాలువాలతో సత్కరించి ఆత్మీయంగా వీడ్కోలు పలికారు.






