18 August, 2026 | 5:44 PM

ఎమ్మార్వో పి.విట్టల్, సీఐ వెంకట్ నారాయణకు ఘన సన్మానం

18-08-2026 04:41 PM

బోధన్,(విజయక్రాంతి): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉద్యోగులుగా అవార్డులు అందుకున్న బోధన్ ఎమ్మార్వో పి. విట్టల్, బోధన్ టౌన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెంకట్ నారాయణలను ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా టాస్మా అధ్యక్షులు కొడాలి కిషోర్ మాట్లాడుతూ.. కింది స్థాయి నుంచి అధికారి స్థాయికి ఎదిగి, ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ తమ వృత్తి ధర్మాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న అధికారులు బోధన్‌లో ఉండటం గర్వకారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగుల అవార్డులు అందుకోవడం సంతోషకరమన్నారు. బోధన్ నియోజకవర్గ అభివృద్ధిలో పి. విట్టల్, వెంకట్ నారాయణల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు.

అనంతరం ఎమ్మార్వో పి. విట్టల్ మాట్లాడుతూ.. గత ఏడాది అధిక వర్షాల కారణంగా హంగర్గ గ్రామం ముంపునకు గురైన సమయంలో అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేసినట్లు తెలిపారు. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య వారధిగా పనిచేసిన సందర్భాలను గుర్తుచేశారు.

బోధన్ టౌన్ సీఐగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వెంకట్ నారాయణ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల భద్రత, అవగాహన కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పి. విట్టల్ పేర్కొన్నారు. షీ టీమ్స్ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు, యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు భద్రత, క్రమశిక్షణ, చట్టాలపై అవగాహన కల్పించడంలో వెంకట్ నారాయణ పాత్ర కీలకమని అన్నారు.