పాకిస్థాన్ రైలుపై ఫిదాయీన్ దాడి.. 24 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని నైరుతి నగరమైన క్వెట్టా ప్రాంతంలోని చమన్ ఫాటక్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో కనీసం 24 మంది మరణించగా, 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు కారణంగా చుట్టుపక్కల ప్రాంతంలో భారీ నష్టం వాటిల్లిందని, సమీప భవనాల కిటికీలు, అద్దాలు పగిలిపోయాయని పోలీసు అధికారులు తెలిపారు. రైలు మార్గానికి ఆనుకుని నిలిపి ఉంచిన పలు ఇళ్లు, వాహనాలు కూడా ఈ ప్రభావానికి దెబ్బతిన్నాయి. సంఘటన జరిగిన వెంటనే, సహాయక, భద్రతా బృందాలు ఆ ప్రాంతానికి చేరుకొని అత్యవసర సహాయక చర్యలు కొనసాగించాయి.
ఈ పేలుడులో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన ఒక బోగీ మంటలకు ఆహుతైనట్లు స్థానిక నివేదికలు తెలిపాయి. ఈ రైలు పెషావర్‌కు బయలుదేరాల్సి ఉన్నట్లు సమాచారం. బలూచిస్తాన్ హోం వ్యవహారాల ప్రత్యేక సలహాదారు బాబర్ యూసుఫ్‌జాయ్ మాట్లాడుతూ... ఈ ఘటనపై సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారని, సంబంధిత సంస్థలన్నింటినీ అప్రమత్తం చేసినట్లు ఆయన తెలిపారు.
సహాయక చర్యలు కొనసాగుతున్నందున, పేలుడు జరిగిన ప్రదేశానికి సమీపంలో గుమిగూడకుండా ఉండాలని ఆయన స్థానికులకు విజ్ఞప్తి చేశారు. ఈ దాడిలో గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడు జరిగిన కొద్దిసేపటికే, నైరుతి బలూచిస్తాన్‌లో పాకిస్థానీ సైనిక సిబ్బందిని తీసుకువెళ్తున్న రైలును లక్ష్యంగా చేసుకుని ఫిదాయీన్ లేదా ఆత్మాహుతి దాడి చేశామని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించింది.






