కంటోన్మెంట్‌లో 50.55 శాతం పోలింగ్
ముగిసిన ఉప ఎన్నిక
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 13 (విజయక్రాంతి): సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నిక సోమవారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 50.55 శాతం పోలింగ్ నమోదయింది. 2023 ఎన్నికలలో 47.43 శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి కొంత పెరిగింది. బీఆర్‌ఎస్ తరఫున నివేదిత పోటీలో ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీగణేష్, బీజేపీ నుంచి డాక్టర్ వంశీ తిలక్ బరిలో ఉన్నారు. కంటోన్మెంట్‌లో తిరుగులేని నేతగా ఎదిగిన మాజీ ఎమ్మెల్యే సాయన్న 2023 ఫిబ్రవరిలో ఆకస్మికంగా మృతిచెందడంతో, అనూహ్యంగా ఆయన చిన్న కూతురు లాస్యనందిత తెరమీదకు వచ్చింది.
2023 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన ఆమె బీజేపీ అభ్యర్థి శ్రీగణేష్‌పై 17,169 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. ఎమ్మెల్యేగా గెలిచిన కొంత కాలానికే 2024 ఫిబ్రవరిలో జరిగిన యాక్సిడెంట్‌లో ఆమె మృతిచెందింది. దీంతో అనివార్యమైన కంటోన్మెంట్ ఉప ఎన్నికలో లాస్యనందిత సోదరి నివేదితను బీఆర్‌ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా బరిలో నిలిపింది. తండ్రి, సోదరి అకాల మరణంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆమెకు సానుభూతి కలిసి వచ్చే అవకాశం ఉంది. కాగా గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన శ్రీగణేష్ ఈసారి కాంగ్రెస్ నుంచి బరిలో నిలుస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా డా.వంశీతిలక్ పోటీ చేస్తున్నప్పటికీ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉండనుందని అంచనా.




