7 April, 2026 | 8:10 PM

విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలి

07-04-2026 06:12 PM

- కలెక్టర్ గరిమ అగ్రవాల్

- ఎంజీబీవీ విద్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

వేములవాడ,(విజయక్రాంతి): ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. వేములవాడ పట్టణంలోని మహాత్మాజ్యోతి బాపూలే బాలికల రెసిడెన్షియల్ విద్యాలయంలో కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాలయం ఆవరణ, తరగతి గదులు, కిచెన్ లో ఆహార పదార్థాలను పరిశీలించారు. మెనూ చార్ట్ పరిశీలించి, ఏఏ వంటకాలు సిద్ధం చేస్తున్నారో తనిఖీ చేశారు.

ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, తమ కుటుంబంలో పిల్లలకు ఆహార పదార్థాలు ఎలా సిద్ధం చేస్తారో అలాగే ఇక్కడ విద్యార్థుల కోసం వండాలని ఆదేశించారు. అనంతరం 9వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. అన్ని పరీక్షలకు సంబంధించిన టైమ్ టేబుల్ సిద్ధం చేసుకోవాలని, ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదవాలో ముందే రాసుకోవాలని, దానికి అనుగుణంగా అన్ని సబ్జెక్టులు చదవడం, రాయడం పూర్తి చేయాలని తెలిపారు. రైటింగ్ కూడా సాధన చేయాలని, వార్షిక పరీక్షల సమయానికి అనుగుణంగా ఇప్పుడు అదే సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసేలా సాధన చేయాలని పేర్కొన్నారు.

ఇప్పటి మార్కులు మీరు తర్వాత చదివే ఉన్నత తరగతులకు ఎంతో కీలకమని స్పష్టం చేశారు. విద్యార్థులం దరూ రానున్న పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఏ నేపథ్యం నుంచి వచ్చినా.. ఇప్పుడు ఇష్టపడి సాధన చేయడం.. అన్ని సబ్జెక్టుల్లో రాణించడంతో వారి భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి వివిధ ఉద్యోగాలు, వృత్తుల్లో స్థిరపడాలని, ఉన్నత స్థానాల్లో నిలవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు.