ఇంధన భద్రతే లక్ష్యం
- భారత్ దౌత్యం మరింత బలోపేతం
- పశ్చిమ ఆసియాలో శాంతికి మద్దతు
- యూఏఈపై దాడులను ఖండిస్తున్నాం
- పధాని నరేంద్రమోదీ
- ఏడు రంగాల్లో వ్యూహాత్మక సహకారంపై ఒప్పందాలు
- ఎల్‌పీజీ, పెట్రోలియం, రక్షణ, సాంకేతిక, ఓడరేవులు,
- ప్రజాసంబంధాలు తదితరాలపై ఎంఓయూలు
- భారత్‌లో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు యూఏఈ అంగీకారం
- ప్రధాని మోదీ, యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సంతకాలు
- మోదీ విమానానికి ఫైట్‌జెట్ ఎస్కార్ట్
అబుదాబి, మే 15: ఇంధన భద్రతే ప్రధాన లక్ష్యమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. భారత్ మధ్య దౌత్యం మరింత బలోపేతం అయ్యిందని, పశ్చిమ ఆసియాలో శాంతికి భారత్ మద్దతిస్తుందని తెలిపారు. అలాగే యూఏఈపై దాడులను ప్రధాని మోదీ ఖండించారు. భారత్ యూఏఈ మధ్య ఏడు కీలక రంగాల్లో వ్యూహాత్మక సహకారంపై ఒప్పందాలు కుదిరాయి.
ఎల్‌పీజీ, పెట్రోలియం, రక్షణ, సాంకేతిక, ఓడరేవులు, ప్రజాసంబంధాలపై ఇరుదేశాలు ఎంఓయూలు చేసుకున్నాయి. భారత్‌లో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు యూఏఈ అంగీకరించింది. దీంతో ఆయా ఒప్పందాలపై ప్రధాని మోదీ, యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సంతకాలు చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఇంధన సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో శుక్రవారం పర్యటిస్తున్నారు.
దేశంలో నాలుగేళ్ల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన తరుణంలోనే ఈ పర్యటన జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో మోదీ సమావేశమయ్యారు. పశ్చిమ ఆసియాలో శాంతిని నెలకొల్పడానికి సాధ్యమైన అన్ని విధాలా మద్దతు ఇవ్వడానికి భారత్ సిద్ధంగా ఉందని, యూఏఈపై జరిగిన దాడులను ఖండిస్తున్నామని మోదీ తెలిపారు.
‘యూఏఈని లక్ష్యంగా చేసుకున్న తీరు ఆమోదయోగ్యం కాదు, కానీ ‘ప్రస్తుత పరిస్థితిని యూఏఈ సంయమనంతో ఎదుర్కొన్న తీరు ప్రశంసనీయమని ప్రధాని స్పష్టంచేశారు. భారత దేశంలో 5 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులను కూడా యూఏఈ ప్రకటించిందని మోదీ తెలిపారు. యూఏఈ పర్యటనలో ఇంధనం, రక్షణ, మౌలిక సదుపాయాలు, షిప్పింగ్, అధునాతన సాంకేతికత వంటి కీలక రంగాల్లో ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయి. ఇది భారత్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపునిచ్చింది’ అని మోదీ సోషల్ మీడియాలో తెలిపారు.
‘మరో ముఖ్యమైన పరిణామం ఏంటంటే, యూఏఈ భారతలో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ప్రకటించిందని, ఇది ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. యూఏఈ పర్యటన అనంతరం, వాణిజ్యంతో సహా పలు రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో జరిగే సమావేశాల కోసం మోదీ నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీలో మోదీ పర్యటించనున్నారు.
శుక్రవారం నాటి చర్చలు నీలి ఆర్థిక వ్యవస్థ, ఫిన్టెక్‌తో సహా సాంకేతికత, రక్షణ, ప్రజల మధ్య సంబంధాలతో పాటు ఇతర అంశాల చుట్టూ సాగాయి. వీటన్నింటిపై సుమారు రెండున్నర గంటలకు పైగా మోదీ చర్చించారు. చర్చల అనంతరం ఈ పర్యటన ఫలితాలు ‘మన స్నేహాన్ని మరింత బలోపేతం చేసి, అభివృద్ధి, శ్రేయస్సుకు దోహదపడతా యని నేను విశ్వసిస్తున్నా’ అని మోదీ యూఏఈ అధ్యక్షుడితో చెప్పారు.
ఏడు కీలక రంగాల్లో ఒప్పందాలు
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) తెలిపిన ప్రకారం.. దేశ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను నిర్వహించే ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజరవ్స్ లిమిటెడ్, వ్యూహాత్మక సహకారమే లక్ష్యంగా అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.
ఇంధన భద్రత, భారత్‌లో పెట్రోలియం నిల్వలను పెంపొందించడం, ద్రవ సహజ వాయువు, ద్రవ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) నిల్వ సౌకర్యాలపై సహకారమే లక్ష్యమని ఎంఈఏ తెలిపింది. భారత దేశంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే వంట ఇంధనమైన ఎల్‌పీజీ దీర్ఘకాలిక సరఫరా, ఆర్థిక స్థిరత్వం, ఇంధన భాగస్వామే లక్ష్యంగా చేసుకుని, ఇద్దరు దేశాధినేతలు ఎల్‌పీజీ రంగంలో ఒప్పందం చేసుకున్నారని వెల్లడించింది.
రక్షణ పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేయడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడంతో పాటు జాతీయ, ప్రాంతీయ భద్రతను పటిష్టం చేయడం లక్ష్యంగా వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యానికి సంబంధించిన ఒక ఫ్రేమ్‌వర్క్‌పై ఒప్పందం కుదిరిందని పేర్కొంది. నాలుగో సహకారం గుజరాత్‌లోని వడినార్‌లో ఓడల మరమ్మతు కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి, ఓడరేవులు, తీరప్రాంత మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి సంబంధించినది కాగా, ఐదోది ఓడల మరమ్మతులో నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన ఒప్పందం అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఆరోది భారతదేశపు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ (ఏఐ) ఆశయాలను బలోపేతం చేయడానికి ఒక సూపర్ కంప్యూటర్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయడం కాగా, ఏడోది బలమైన మార్కెట్లతోపాటు మరిన్ని ఉద్యోగాలను సృష్టించ డానికి 5 బిలియన్ డాలర్ల పెట్టుబడి నిబద్ధత. ‘ఇది భారతదేశ అభివృద్ధితోపాటు వృద్ధి ప్రస్థానానికి యూఏఈ నిరంతర నిబద్ధతను స్పష్టంచేస్తోందని విదేశాంగ మంత్రి త్వశాఖ పేర్కొంది.
ప్రధాని మోదీ విమానానికి ఫైటర్ జెట్లు ఎస్కార్ట్
అంతకుముందు శుక్రవారం, అబుదాబి విమానాశ్రయంలో ప్రధాని మోదీకి అల్ నహ్యాన్ ఘనస్వాగతం పలికారు. ఇది ఈ పర్యటన ప్రాముఖ్యతను ప్రతిబింబించింది. ఒక ప్రత్యేక చర్యగా, మోదీ విమానానికి యూఏఈ సైనిక జెట్లు రక్షణగా వెళ్లాయి. యుఏఈ గగనతలంలో ప్రధాని మోదీ విమానానికి ఎఫ్-16 విమానాలు ఎస్కార్ట్‌గా వెళ్లాయి. ఈ సందర్భంగా ‘ఈరోజు మీ వైమానిక దళం నాకు రక్షణగా నిలిచిన తీరు భారత ప్రజలకు దక్కిన గౌరవం’ అని మోదీ యూఏఈ అధ్యక్షుడితో చెప్పారు.






