15 March, 2026 | 1:23 AM

నిజాం కాలం నాటి ఫిల్టర్ బెడ్

15-03-2026 12:05 AM

కరెంటు లేకుండానే తాగునీరు

నిజం కాలం నాటి ఈ నిర్మాణం 82 ఏళ్లు గడుస్తున్నా చెక్కుచెదరలేదంటే ఆనాటి ఇంజినీర్ల ప్రతిభకు అద్దం పడుతోంది. సాధారణంగా పంటకు సాగు నీరు అందించాలన్న, తాగు నీటిని సరఫరా చేయాలన్నా కరెంట్ తప్పని సరి. కానీ ఎలాంటి కరెంట్ అవసరం లేకుండానే నాలుగు దశల్లో నీటిని శుద్ధి చేసి, పట్టణ ప్రజలకు స్వచ్చమైన తాగునీటిని సరఫరా చేస్తున్న అరుదైన పథకం ఇది. 

ప్రకృతి రమణీయతలకు నెలవైన ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో ప్రాచీన నిర్మాణాలు ఉన్నాయి. అందులో కొన్ని కాలక్రమంలో కనుమరుగవుతే, మరికొన్ని చెక్కుచెదరకుండా నేటికి అనాటి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అలాంటి వాటిలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఫిల్టర్ బెడ్ ఒకటి. దశాబ్దాల నాటి నిర్మాణం ఇది. మోటార్లు లేకుండా నీటిని సరఫరా చేయడం దీని పత్యేకత. ఈ ఫిల్టర్ బెడ్‌ను 1944లో లండన్‌కు చెందిన ది క్యాండి ఫిల్టర్ కంపెనీ లిమిటెడ్ వారు నిర్మించారు.

1947 నుంచి ఈ ఫిల్టర్ బెడ్ వాడుకలోకి వచ్చింది. దీనికి ది క్యాండి ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టరేషన్ ప్లాంట్‌గా పేరు పెట్టారు. ఆనాటి జనాభాను దృష్టిలో ఉంచుకొని భావి అవసరాలను అంచనా వేసి నాటి ఇంజనీర్లు దూర దృష్టితో ఎక్కువ మంది ప్రజలకు తాగేందుకు శుద్ధమైన నీటిని అందించే ఉద్దేశంతో ఈ ఫిల్టర్‌ను నిర్మించారు. ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండి ప్రజల నీటి అవసరాలను తీరుస్తూ వస్తోంది. 

7 కిలోమీటర్ల దూరం నుంచి.. 

ఆదిలాబాద్ పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మావల చెరువు నుంచి పైప్‌లైన్ ద్వారా నీరు ఈ ఫిల్టర్ బెడ్‌లోని ట్యాంకుల్లోకి వచ్చి చేరుతుంది. ట్యాంకులో నీటిని బయటకు వదిలే ముందు అందులో ఆలం అనే పదార్థాన్ని కలుపుతారు. ఈ ఆలం నీటిలో ఉన్న మట్టిని వేరు చేస్తుంది. అనంతరం ఆ నీరు 28 అడుగుల లోతు ఉన్న ఫిల్టర్ ట్యాంకులోకి వచ్చి చేరుతుంది. అక్కడి నుంచి ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా 12 అడుగుల లోతు ఉన్న ట్యాంకులోని వచ్చి చేరుతుంది. ఈ ట్యాంకు అడుగు భాగంలో ఇసుక, కంకర రాయి, బొగ్గు ఉంచుతారు. ఇక్కడ నీటినిలోని మలినాలన్ని తొలగిపోయి శుద్ధి అయిన నీరు కిందికి పోతుంది.

ఇలా పూర్తిస్థాయిలో శుద్ధి అయిన నీటిని భూగర్భ మార్గంలోనే దగ్గరలో ఉన్న పంప్ హౌజ్ లోకి పంపిస్తారు. రెండు చోట్ల క్లోరినేషన్ పరీక్ష చేసిన అనంతరం ప్రజలకు నీటిని సరఫరా చేస్తారు. ఇక్కడి నుంచే పట్టణంలోని పలు కాలనీలకు నల్లా ద్వారా నీటిని సరఫరా అవుతోంది. ట్యాంకర్ల ద్వారా కూడా నీటిని తీసుకువెళ్లి సరఫరా చేస్తారు. నీటిని శుద్ధి చేసి ప్రజలకు స్వచ్చమైన నీటిని అందిస్తూ ఆదిలాబాద్ పట్టణంలోని ఫిల్టర్ బెడ్ ఈ ప్రాంత ప్రజల పాలిట వరప్రదాయినిగా మారింది. చిన్నపాటి నీటి సరఫరా జరగాలన్న కరెంట్ తప్పని సరి. కానీ ఏకంగా ఆదిలాబాద్ పట్టణంలో ప్రజలకు నీటి నీ అందించేందుకు నిజం కాలం నాటి ఇంజనీర్లు అద్భుత ప్రతిభకు నిరదర్శనంగా నిలుస్తుంది ఈ ఫిల్టర్ బెడ్.

 వెంకటేష్ (ఆదిలాబాద్, విజయక్రాంతి)