మిట్ట మధ్యాహ్నం.. అక్షింతలు
ఆదిలాబాద్ జిల్లాలోని గోండు, కొలం తెగ ల గిరిజనులు వారి సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. నూతన వధూవ రులకు మిట్ట మధ్యాహ్నం పెళ్లిళ్లు చేస్తారు. గోండ్, కొలం గిరిజనులు రెండుసార్లు అక్షంతలు వేసి నూతన వధూవరులకు ఆశీస్సులు అందిస్తారు. మండుటెండలో సూర్యచంద్రుల సాక్షిగా జొన్నలు, మినుములు, బియ్యం కలిపిన అక్షింతలను వేస్తారు.
ముందుగా (గోవర్ధన్ గో టాన్) ఆలయం ముందు మండుటెండలో సూర్యచంద్రుల సాక్షిగా జొన్నలు, మినుములు, బియ్యం కలిపిన అక్షింతలను వేస్తారు. అక్కడి నుండి వరు డి ఇంటికి వచ్చి వరుడు ఇంటి ముందు వేసిన పచ్చని పెళ్లి పందిట్లో ఆదివాసీ సంస్కృతి సాం ప్రదాయంగా మట్టి కుండలు చుట్టుపెట్టి పోలు చుట్టి నూతన వధూవరులను ఐదుసార్లు ప్రదక్షణ చేయిస్తారు. ఆ సమయంలో నూతన వధూవరుల బంధువుల మహిళలు మంగళ హారతులు పట్టుకొని ప్రత్యేక నృత్యా లు చేస్తారు.
అనంతరం గోండి భాషలో వేదమంత్రాలను చదివి మరోసారి అక్షింతలు వేస్తారు. అందరి సమక్షంలో నూతన వధువు మెడలో వరుడు మంగళసూత్రం కట్టే ముందు ముత్తుదువల ఆశీస్సులను తీసుకున్న తర్వాత వరుడు వధువు మెడలో గోండి భాషలోని వేదమంత్రాలు మధ్య మంగళ సూత్రాన్ని కట్టిస్తారు. వీరు పెండ్లిలను ఐదు రోజులపాటు నేటికీ కొనసాగిస్తున్నారు.
కట్న కానుకలు లేవు..
ఆదివాసి గిరిజనుల పెండ్లిలకు కట్న కానుకలు తీసుకోవడం నిషేధించారు. వధువు గ్రామం వారు ఒక్కో ఇంటికి రూ.200 నుంచి రూ.500 జమ చేసి పెళ్లికి బహుమతిగా అందిస్తున్నారు. వరుడి గ్రామంలో ప్రతి ఇంటికి 200 రూపాయలు చేసి వరుడికి కానుకగా అందిస్తున్నారు. పెళ్లికి వచ్చిన అతిథులకు అన్నం, పప్పు తోపాటు ఒక రకమైన స్వీట్ సహాపంక్తి భోజనంగా అందిస్తున్నారు.
తరతరాలుగా వస్తున్న సంప్రదాయం
తరతరాలుగా వస్తున్న ఆదివాసి గిరిజనుల సంప్రదాయంగా మిట్ట మధ్యాహ్నం పెండ్లిలో నిర్వహిస్తున్నాం. వధూవరులకు ఆదివాసి పెద్దలు పెండ్లి తేదీని నిర్ణయిస్తారు. ఆ తేదీ ప్రకారం మిట్ట మధ్యాహ్నం సూర్యచంద్రుల సాక్షిగా అక్షింతలు వేస్తే ఆ కుటుంబం కలకాలం క్షేమంగా ఉంటుందని మా నమ్మకం.
పేందూర్ దాదారావు, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్
మా సంస్కృతిని కాపాడుతున్నాం
కంప్యూటర్ యుగంలోనూ మా సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటున్నాం. ఐదు రోజులపాటు జరిగే పెండ్లి తంతులో ఎక్కడ కూడా సాంప్రదాయాన్ని మర్చిపోము. పెండ్లి తేదీని పెద్దలు రాత్రి 9 గంటల తర్వాత ఆకాశంలో చుక్కలను చూసి నిర్ణయిస్తారు.
ఆత్రం భీంరావు, గిరిజన పెద్ద, వాడ్‌గావ్, ఇంద్రవెల్లి మండలం
బండారి లక్ష్మీనర్సయ్య (ఉట్నూర్, విజయక్రాంతి)




