2 March, 2026 | 5:50 AM

ఎట్టకేలకు సర్పంచుల ఫోరం ఎన్నిక

02-03-2026 02:23 AM
  1. కుదరని ఏకాభిప్రాయం

బీఆర్‌ఎస్ వేరు కుంపటి

ఆనాడే చెప్పిన విజయక్రాంతి

మానకొండూరు, మార్చి1 (విజయక్రాంతి) స్వపక్షంలో చెలరేగిన అసమ్మతి రాగాన్ని అధిగమించి, భారాస సభ్యుల కూటమిని కాదని, భాజపా తో జతకట్టి మాన కొండూరు మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్ష, కార్యవర్గాన్ని కాంగ్రెస్ ఎట్టకేలకు ప్రకటించింది. దీంతో మండల సర్పం చుల ఫోరం ఎన్నికల్లో గత రెండు నెలలకు పైబడి నెలకొన్న సందిగ్ధతకు తెర పడినట్లయింది.

మండలంలో 29 సర్పంచ్ స్థానాల కు గాను కాంగ్రెస్ 16, భాజపా 2, బీ ఆర్‌ఎస్ 11, స్థానాలు కైవసం చేసుకున్నాయి. కాగా భాజపాతో జతకట్టి కాంగ్రెస్ అధ్యక్ష స్థానాన్ని కైవసం చేసుకుంది. భాజాపాకు ప్రధాన కార్యదర్శి స్థానాన్ని కేటాయించి కాంగ్రెస్ ఫోరమ్ కార్యవర్గ ఎన్నిక లాంచనాన్ని పూర్తి చేసింది. భారాస ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రెటరీ స్థానాలు డిమాండ్ చేయగా చర్చలు విఫలమై ఏకాభిప్రాయం కుదరక పోవడంతో భారాస సభ్యులు అసంతృప్తికి లోనయ్యారు.

చర్చలు సఫలీకృతం కాకపోవడం, ఉపాధ్యక్ష జనరల్ సెక్రటరీ స్థానాలను కేటాయించటానికి, సర్పంచుల పై వ్యక్తిగతంగా సైతం కాంగ్రెస్ పార్టీ సర్పంచులు భారాస సర్పంచ్ లకు ఆయా స్థానాల కేటాయింపుకు విముఖత చూపడం, తో రాజీయత్నాలు విఫలమయ్యాయి . భాజపా మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ఫోరం అధ్యక్ష, కార్యవర్గాన్ని ప్రకటించింది. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ సర్పంచులు ఉండటంతో కార్యవర్గ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి నల్లేరుపై నడకలా సాగింది. అంతకుముందు మండల పరిషత్ కార్యాలయ ఆధ్వర్యంలో స్థానిక సర్పంచులకు సన్మాన కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా సన్మాన కార్యక్రమం లో సైతం పార్టీ పరంగా ఎవరికి వారే ఎడమొఖం పెడ ముఖంగా సన్మాన కార్యక్రమం లో పాల్గొన్నారు. తదుపరి అధ్యక్ష ,కార్యవర్గ ఎన్నికపై చర్చలు జరిపిన సయోధ్య కుదరక చర్చలు విఫలమయ్యాయి. దాంతో కాంగ్రెస్ సర్పంచులు ఏకగ్రీవంగా కార్యవర్గాన్ని ప్రకటించారు. మండల ఉప సర్పంచ్ ల ఫోరం ఎన్నికల్లో భాజపా సభ్యులు భారాస కు మద్దతుగా నిలువగా, తాజాగా సర్పంచుల ఫోరం ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించడం ఈ ఉదంతంలో కొసమెరుపు. మండల సర్పంచ్ ల ఫోరం పార్టీలకు అతీతంగా, సర్పంచుల అందరి ఆమోదయో గ్యంతో కార్యవర్గాన్ని ప్రకటించాలని, కానీ ప్రస్తుతం కాంగ్రెస్ సర్పంచులు ఏకపక్షంగా, ఏకగ్రీవంగా కార్యవర్గాన్ని ప్రకటించార ని భారాస సభ్యులు అసంతృప్తి, నిరసన వ్యక్తం చేశారు.

ఆనాడే చెప్పిన ‘విజయక్రాంతి’

అధ్యక్షుని ఎన్నికపై మండలంలో నెలకొన్న, కొనసాగుతున్న పరిణామాలపై, బీఆర్‌ఎస్ సర్పంచులతో కుదరని సయోధ్య, స్వపక్షంలోనూ అసమ్మతి రాగం, అంశాలను ప్రస్తావిస్తూ ఆ అధ్యక్షుడెవరు , ప్రధాన శీర్షికన విజయ క్రాంతి ఫిబ్రవరి 4న కథనం ప్రచురించింది. తాజాగా కథనంలో ప్రస్తావించిన అంశాలు బీఆర్‌ఎస్ వేరు కుంపటి, పలు అంశాలు నిజమయ్యాయి.

ఫోరం అధ్యక్ష, కార్యవర్గం

అధ్యక్షుడిగా పెంచాల కిషన్ రావు, గౌరవ అధ్యక్షుడిగా మీస సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా బుర్ర శ్రీధర్ గౌడ్, కొత్త రామ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా, అంబటి స్వామి, కార్యదర్శి ఎడ్ల సత్యనారాయణ, కోశాధికారి బొట్ల స్వరూప, సభ్యులుగా కనవేని అక్షయ, రామడుగు హరీష్ ,ఆడెపు రజిత, పాకాల వందన, కనకం సుజాత, తోటలత లు ఎన్నికయ్యారు.

కాంగ్రెస్ సర్పంచ్‌ల ఫోరం

పార్టీలకతీతంగా సర్పంచుల అందరి ఆమోదయోగ్యంతో, ఏకాభిప్రాయంతో ఏర్పడిన ఫోరం ఇది కాదని ఇది కేవలం కాంగ్రెస్ సర్పంచ్ ల ఫోరం మాత్రమేనని భారాస సర్పంచులు విమర్శించారు. పరిస్థితులు నిశితంగా గమనిస్తున్నామని, తగిన సమయంలో, సరైన రీతిలో స్పందిస్తామన్నారు.