స్నేహితుడి కుటుంబానికి 1996 బ్యాచ్ ఆపన్నహస్తం
టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండలం దాస్ తండా పంచాయతీ పరిధిలోని లచ్చ తండా గ్రామానికి చెందిన మాజీ అక్షర భారతి మండల కోఆర్డినేటర్, మిషన్ భగీరథ విభాగం ఆపరేటర్ బాదావత్ హరిదాసు ఈనెల 21న అనారోగ్యంతో అకాల మరణం చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
శనివారం ఆయన స్వగ్రామమైన లచ్చ తండాలో నిర్వహించిన కర్మకాండల కార్యక్రమానికి, హరిదాసు పాఠశాల నాటి మిత్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఒకప్పుడు ఒకే తరగతిలో కలిసి చదువుకుని, భవిష్యత్తుపై వెయ్యి ఆశలతో అడుగులు వేసిన, బాల్య మిత్రుడు నేడు తమ మధ్య లేడనే చేదు నిజాన్ని దిగమింగలేక ,తోటి స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు.
రూ. 30,000 ఆర్థిక సాయం అందజేత
కష్ట కాలంలో మిత్రుడి కుటుంబానికి అండగా నిలవడమే ,నిజమైన స్నేహానికి గుర్తింపు అని నిరూపిస్తూ, 1996 పదవ తరగతి బ్యాచ్‌కి చెందిన క్లాస్‌మేట్స్ ,అందరూ ఏకమయ్యారు. హరిదాసు కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని, తమ వంతుగా బాధ్యత తీసుకుంటూ రూ. 30,000 ఆర్థిక సహాయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అందజేసి ,తమ ఉదారతను చాటుకున్నారు.






