30 August, 2026 | 1:42 AM

సమ్మె నోటీసుతో పలు కీలక ఒప్పందాలు

30-08-2026 12:27 AM

టేకులపల్లి,(విజయక్రాంతి): సింగరేణి కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఏఐటీయూసీ చేస్తున్న పోరాటాల ఫలితంగా యాజమాన్యంతో పలు కీలక ఒప్పందాలు కుదిరాయని ఏఐటీయూసీ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కమిటీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కె. సారయ్య శనివారం తెలిపారు. కోయగూడెం ఓపెన్ కాస్ట్ లో ఉదయం షిఫ్ట్‌ సందర్భంగా నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు.

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 31 డిమాండ్లతో, సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వగా, దీనిపై పలుమార్లు చర్చలు జరిగాయని తెలిపారు. ఈనెల 27న హైదరాబాద్‌లోని ఆర్‌ఎల్‌సీ వద్ద సింగరేణి యాజమాన్యం, గుర్తింపు సంఘమైన ఏఐటీయూసీ మధ్య జరిగిన, చర్చల్లో 22 అంశాలపై ఒప్పందాలు కుదిరాయని వెల్లడించారు. ఇది సింగరేణి చరిత్రలో ఏఐటీయూసీ సాధించిన కీలక విజయమని పేర్కొన్నారు.

ఆదాయపు పన్ను, సహజ మరణం పొందిన కార్మికుడి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం, మెడికల్ బోర్డు, బదిలీ నిబంధనల్లో మార్పులు, ప్రమోషన్లు, వైద్య సదుపాయాల మెరుగుదల, ఖాళీ పోస్టుల భర్తీ, డిపెండెంట్ ఉద్యోగాల పెండింగ్ కేసుల పరిష్కారం తదితర అంశాలపై, యాజమాన్యంతో అంగీకారం కుదిరిందని కార్మికులకు వివరించారు. కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతుందని, భవిష్యత్‌లోనూ రాజీలేని ఉద్యమాలను కొనసాగిస్తామని సారయ్య తెలిపారు. ఏఐటీయూసీ సాధించిన ఒప్పందాలపై కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. చర్చల్లో పాల్గొన్న కె.సారయ్యను కార్మికులు ఘనంగా సన్మానించారు.

అనంతరం పరస్పరం మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి ఎం.డి. నజీర్ అహ్మద్, సహాయ కార్యదర్శి కోంగర వెంకటేశ్వర్లు, ఫిట్ కార్యదర్శి మాలోత్ హరిసింగ్, నాయకులు నాదెండ్ల శ్రీనివాస్‌రెడ్డి, షేక్ సర్వర్, జి.ఎ. శ్రీనివాస్, మనోజ్‌కుమార్, భూక్యా బాలు, అజ్మీరా కిషోర్, రెడ్డి సాంబశివరావు, బండి సీతారాములు, రంజిత్‌కుమార్, వెంకటనర్సయ్య, గుగులోత్ దల్‌సింగ్, హుస్సేన్, మైఖేల్, కోటయ్య, భద్రూ, ఎం.డి. యాకూబ్, వినీత్‌కుమార్, నాగేందర్, అహ్మద్, వినయ్‌బాబు, గుత్తి వెంకటేశ్వర్లు, షేక్ వలి తదితరులు పాల్గొన్నారు.