ఉద్యోగాలంటూ వసూళ్లు ఎమ్మెల్యే పీఏపై కేసు
30-08-2026 12:45 AM
- భద్రాచలం పోలీస్ స్టేషన్‌లో ఆధారాలతో బాధితుడి ఫిర్యాదు
- దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకోవాలన్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 29 (విజయక్రాంతి): అధికార పార్టీ ఎమ్మెల్యే వద్ద పర్సనల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి ఉద్యోగాల పేరుతో పలువురి దగ్గర కోట్లాది రూపాయలు వసూలు చేశాడనే ఆరోపణలపై శనివారం భద్రాచలం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
మణుగూరు థర్మల్ పవర్ స్టేషన్, హెవీ వాటర్ ప్రాజెక్టులలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఎమ్మెల్యే పీఏ కే కళ్యాణ్ కుమార్ పలువురితో కోట్లలో డబ్బులు వసూలు చేశాడు.
అంబాసత్రం రోడ్డుకు చెందిన ఆటోవాలా రాయల శ్రీను భద్రాచలం పట్టణ పోలీసు స్టేషన్‌లో కళ్యాణ్‌పై చీటింగ్ కేసు నమోదు చేశాడు. ఈ విషయంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






