కార్మిక సదస్సును జయప్రదం చేయండి
టేకులపల్లి,(విజయక్రాంతి): కార్మిక చట్టాల పరిరక్షణ, సమాన పనికి సమాన వేతనం అమలు, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయడంతోపాటు వివిధ రంగాల కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 1న కొత్తగూడెంలో నిర్వహించనున్న జిల్లా స్థాయి కార్మిక సదస్సును జయప్రదం చేయాలని శనివారం ఐఎఫ్‌టీయూ నాయకులు పిలుపునిచ్చారు. టేకులపల్లి ఏరియాలో కరపత్రాలను ఆవిష్కరించి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకులు డి.ప్రసాద్, తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టీయూ) టేకులపల్లి మండల అధ్యక్షుడు మూడు బిచ్చు మాట్లాడుతూ... సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆటో కార్మికులకు ఏటా రూ.10 వేల ఆర్థిక సహాయం అందించాలని కోరారు.గ్రామపంచాయతీ కార్మికులకు ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని, కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా రావాల్సిన ప్రయోజనాలను సకాలంలో అందించాలని, లేబర్ కార్డులను వెంటనే రెన్యువల్ చేయాలని కోరారు.
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలను, బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సెప్టెంబర్ 1న కొత్తగూడెంలో జరిగే జిల్లా స్థాయి కార్మిక సదస్సుకు, వివిధ రంగాల కార్మికులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో నాను, పాషా, జినక ప్రసాద్, గుగులోతు శ్రీను, రత్నాచారి, యాదగిరి, మోహన్, లక్ష్మయ్య, మానుసింగ్, రామ, వీరన్న, రామదాసు తదితరులు పాల్గొన్నారు.కార్మిక సదస్సును జయప్రదం చేయాలన్నారు.






