పంపిణీకి సిద్ధమైన సన్న బియ్యం
దుకాణాలకు చేరుకుంటున్న రేషన్...
ఏర్పాట్లు చేసిన అధికారులు
మంచిర్యాల, జూలై 9 (విజయక్రాంతి): జిల్లాలోని 423 రేషన్ దుకాణాలకు జూలై నెలా రేషన్ పంపిణి చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవిలో ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మూడు (ఏప్రిల్, మే, జూన్) నెలల రేషన్ ఒకే సారి యూనిట్ కి 18 కిలోల చొప్పున ఏప్రిల్ నెలలోనే లబ్ధిదారులకు అందజేసిన అనంతరం జూలై నెల నుంచి తిరిగి యథావిధిగా నెలకోసారి రేషన్ అందజేసే పనిలో సివిల్ సప్లయ్ అధికారులు నిమగ్నమయ్యారు. అన్ని మండలాల్లోని రేషన్ దుకాణాలకు వాటి కోటా ఆధారంగా బియ్యంను ఆరు ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి సరఫరా చేస్తున్నారు.
పంపిణీకి 3,714.325 మెట్రిక్ టన్నులు...
జిల్లాలోని 18 మండలాల్లో 2,56,736 (ఏఎఫ్‌ఎస్సీ 15,538, ఎఫ్‌ఎస్సీ 2,41,039, ఏఏపీ 159) కార్డులున్నాయి. ఈ కార్డుల పరిధిలో 7,59,255 (ఏఎఫ్‌ఎస్సీ 45,761, ఎఫ్‌ఎస్సీ 7,13,329, ఏఏపీ 165) యూనిట్లున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఒక్కో యూనిట్ కు ఆరు కిలోల చొప్పున లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఇందు కోసం 3,714.325 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని సంబంధిత శాఖ అధికారులు రేషన్ దుకాణాలకు ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఆయా ఎంఎల్‌ఎస్ పాయింట్ల పరిధిలోని దుకాణాలకు రేషన్ బియ్యం చేరుకుంటుంది. కొన్ని దుకాణాలలో వచ్చిన బియ్యాన్ని వెంట వెంటనే లబ్ధిదారులు పంపిణీని సైతం మొదలు పెట్టారు.






